
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో చెట్టును ఢీకొట్టిన స్కూటీ
- పాలమూరు జిల్లాలో బైకులు ఢీకొనడంతో ప్రమాదం
కొడిమ్యాల/మహబూబ్‌నగర్ రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోగా, మహబూబ్‌నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ సమీపంలో రెండ్ బైక్‌లు ఢీకొని మరో ఇద్దరు యువకులు మరణించారు. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా మల్యాల మండలకేంద్రానికి చెందిన రాజ్ కుమార్(25) ముంబాయిలో పని చేసేవాడు. మల్యాలకే చెందిన గణేశ్(22)తో కలిసి స్కూటీపై వేములవాడ వైపు వెళ్తున్నారు.
కొడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలోని మూల మలుపు వద్ద స్కూటీ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ స్పాట్‌లోనే చనిపోయారు. పోలీసులు స్పాట్‌కు చేరుకొని వివరాలు సేకరించారు. ఇదిలాఉంటే మల్యాలకు చెందిన రాజ్ కుమార్‌కు, మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ముంబైలో ఉంటున్న రాజ్ కుమార్ విడాకుల పత్రం తీసుకునేందుకు మంగళవారం మల్యాల వచ్చి ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మరోవైపు గణేశ్ మొక్కులో భాగంగా మంగళవారం మొహర్రం సందర్భంగా పెద్దపులి వేషం కట్టాడు. రంగులు పూసుకుని ఊరంతా తిరిగి సందడి చేసిన గణేశ్ ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
బైకులు ఢీకొని..
మహబూబ్‌నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ సమీపంలో రాయచూర్ హైవేపై బుధవారం సాయంత్రం ఎదురెదురుగా వేగంగా వస్తున్న బైకులు ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. రూరల్ ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ మండలం మాచన్ పల్లి తండాకు చెందిన శ్రీనివాస్(28) మహబూబ్‌నగర్ కు బైక్‌పై బయలుదేరాడు. అదే సమయంలో కౌకుంట్లకు చెందిన నిస్సార్(27) మహబూబ్‌నగర్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ధర్మాపూర్ సమీపంలో హైవేపై వీరి బైక్‌లు ఢీకొనడంతో నిస్సార్ అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రగాయాలైన శ్రీనివాస్ ను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.