నాలుగేండ్లుగా కులం నుంచి వెలి : మహిళ ఆత్మహత్యాయత్నం

నాలుగేండ్లుగా కులం నుంచి వెలి : మహిళ ఆత్మహత్యాయత్నం

బయ్యారం, వెలుగు: కులబహిష్కరణతో వేధించడమే కాకుండా జరిమానా కట్టలేదని కుటుంబంపై దాడికి పాల్పడడంతో ఓమహిళ పురుగులమందు తాగారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలం  కొత్తగూడెంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈసాల ధనుంజయ, పద్మ  భార్యాభర్తలు. వీరి కుమారుడు నరేశ్‌‌ అదే ఊరికి చెందిన ఓ యువతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో, గ్రామ పెద్దలు విడాకులు ఇప్పించారు. ఇందుకు నరేశ్‌‌ అమ్మాయికి నాలుగు లక్షల రూపాలయలు జరిమానా చెల్లించాలని తీర్మానం చేశారు. జరిమానా చెల్లించలేదని గ్రామ పెద్దలు వారిని కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

వీరి ఇంటికి ఎవరూ వెళ్లవద్దని, శుభకార్యాలకు పిలువ వద్దని… తీర్పును ఎవరైనా ధిక్కరిస్తే, 50వేల రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో నాలుగేళ్లుగా గ్రామంలో వారి కులం వారు ఎవరు బాధితులతో మాట్లాడడం లేదు. అయితే ఇన్నాళ్లు అవుతున్నా జరిమానా చెల్లించడం లేదని పెద్ద మనుషులు మంగళవారం ఇంటిపై దాడికి పాల్పడి కుటుంబ సభ్యులందరిని కొట్లారు. అవమానభారంతో పద్మ  పురుగు మందు తాగినట్లు భర్త ధనుంజయ తెలిపారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని మహబూబాబాద్​ ఏరియా దవాఖానా డాక్టర్లు చెప్పినట్లు పేర్కొన్నారు.