అడ్డుకోవాలని ప్రయత్నిస్తే హైకోర్టుకు వెళ్లి పర్మిషన్‌‌ తెచ్చుకుంటాం

అడ్డుకోవాలని ప్రయత్నిస్తే హైకోర్టుకు వెళ్లి పర్మిషన్‌‌ తెచ్చుకుంటాం

11 రోజులు.. 110 కిలోమీటర్లు
ఈ నెల 12 నుంచి 22 వరకు బీజేపీ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర: మనోహర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు పాదయాత్ర కమిటీ కన్వీనర్ గొంగడి మనోహర్ రెడ్డి తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌ చేపట్టనున్న ఈ యాత్రను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్‌‌చార్జ్​ సునీల్ బన్సల్ ప్రారంభించనున్నట్లు చెప్పారు.

ఈ యాత్ర మొత్తం మల్కాజిగిరి పార్లమెంట్‌‌ పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు కూకట్‌‌పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్‌‌‌‌, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నంలో కొనసాగనుందన్నారు. కుత్బుల్లాపూర్‌‌‌‌ నియోజకవర్గంలోని చిత్తారమ్మ గుడి వద్ద నుంచి ప్రారంభమై ఈ నెల 22న పెద్ద అంబర్‌‌‌‌పేట్‌‌ ఔటర్‌‌‌‌ రింగ్‌‌ రోడ్‌‌ వద్ద ముగియనుందని తెలిపారు. అక్కడే బహిరంగ సభను నిర్వహించనున్నట్లు, దీనికి జాతీయ నేతలు రానున్నట్లు వెల్లడించారు. శనివారం పార్టీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.

11 రోజుల్లో 10 రోజులు యాత్ర సాగనుందని, రోజుకు 11 కిలో మీటర్ల చొప్పున 110 కి.మీ సంజయ్ నడవనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా హైదరాబాద్‌‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్నందున ఆ రోజు యాత్రకు విరామం ఉంటుందని చెప్పారు. యాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తే హైకోర్టుకు వెళ్లి పర్మిషన్‌‌ తెచ్చుకుంటామని తెలిపారు.