
- ఈ నెల 26 నాటికి నికరంగా రూ.37,317 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఇండియన్ మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నారు. ఈ నెల ఒకటి నుంచి 26 వరకు నికరంగా రూ.37,317 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. కిందటేడాది నవంబర్ తర్వాత ఒక నెలలో ఇంతలా విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు రావడం ఇదే మొదటిసారి. అన్ని సెక్టార్లలోని షేర్లలో ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు, ఎక్కువగా ఫైనాన్షియల్ షేర్లను కొనుగోలు చేశారు. ఈ ట్రెండ్ రానున్న నెలల్లో కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా నిఫ్టీ 50 కొత్త గరిష్టాలకు చేరుకుంటుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.
ఎన్‌ఎస్‌డీఎల్ డేటా ప్రకారం, ఈ నెల 1 నుంచి 26 మధ్య ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లోకి నికరంగా రూ. 37,317 కోట్ల ఇన్‌ఫ్లోస్ వచ్చాయి. ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికం సెక్టార్లలో ఎఫ్‌ఐలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. ఫైనాన్షియల్ సెక్టార్‌లో భారీగా డబ్బులు పెట్టారని వెల్లడించారు. ఎఫ్‌పీఐలు నికర కొనుగోలుదారులుగా మారడంతో నిఫ్టీ ఈ నెలలో 2.4 శాతం పెరిగింది.
అభివృద్ధి చెందిన మార్కెట్‌లు ఇబ్బంది పడుతుంటే ఇండియన్ మార్కెట్లు మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ చేశాయి. జీఎస్‌టీ కలెక్షన్స్, పీఎంఐ డేటా, క్రెడిట్ గ్రోత్ వంటి మాక్రో ఎకనామిక్ డేటా మార్కెట్‌ను నడిపిస్తుందని విజయకుమార్ పేర్కొన్నారు. నిఫ్టీ రికార్డ్ లెవెల్‌కు చేరుకుంటుందని, కానీ, వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉండడం వలన షార్ప్ ర్యాలీ ఉండకపోవచ్చని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.11,631 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.