ఆకాశంలో ఆయుధం..2023 నాటికి స్పేస్ లోకి

ఆకాశంలో ఆయుధం..2023 నాటికి స్పేస్ లోకి

పెద్ద పెద్ద దేశాలు ఇప్పటికే అంతరిక్షంపై పట్టు బిగించేశాయి. మరి, అక్కడే యుద్ధమంటూ జరిగితే పరిస్థితేంటి? అమెరికా, చైనా, భారత్​ వంటి దేశాలు ఇప్పటికే యాంటీ శాటిలైట్​ మిసైల్స్​ను సిద్ధం చేసుకున్నాయి. ఇటీవలే ఇండియా దానిని విజయవంతంగా పరీక్షించింది కూడా. మరి, భూమ్మీది నుంచి కాకుండా ఆకాశంలో ఉంటూనే దాడి చేసే సత్తా ఉంటే ఎట్లుంటది? ఆ సత్తానే సంపాదించుకుంది ఫ్రాన్స్​. శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించేలా ఆయుధాలతో కూడిన నిఘా ఉపగ్రహాన్ని తయారు చేసింది ఆ దేశం. అంటే శత్రు దేశాల వ్యూహ ప్రతివ్యూహాలను పసిగట్టడమే కాకుండా, దాడి చేయడానికి ఉపయోగించే మిసైళ్లను నాశనం చేసేలా వాటికి లేజర్లు, మెషీన్​ గన్నులను అమర్చింది. వాటికి తోడుగా ఆయుధాలున్న డ్రోన్లూ జత కలవబోతున్నాయి. 2023 నాటికి ఈ నిఘా ఉపగ్రహాన్ని, ఆ డ్రోన్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది ఫ్రాన్స్​. ఈ విషయాన్ని గురువారం లైయన్​ మోంట్​ వెర్దన్​ ఎయిర్​బేస్​లో జరిగిన కార్యక్రమంలో స్వయానా ఆ దేశ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్​ పార్లీ ప్రకటించారు. ‘‘అంతరిక్షంలో మిలటరీ ఆపరేషన్లు చేయాలంటే, ఒంటరిగా పోరాడే సత్తా సాధించుకోవాలి. అలాగని ఆయుధాల రేసులో ఫ్రాన్స్​ ఉండబోదు” అని పార్లీ చెప్పారు. ఉపగ్రహాలను ఎవరైనా టార్గెట్​ చేస్తే, వారి పనిబట్టేందుకు మాత్రమే వీటిని ఉపయోగిస్తామన్నారు. ఈ స్పేస్​కమాండ్​ అంతా కూడా దేశ వాయుసేన ఆధ్వర్యంలోనే పనిచేస్తుందన్నారు. అంతరిక్ష ప్రయోగాలు దేశ భద్రతకు సవాళ్లు విసురుతున్న నేపథ్యంలోనే ఈ స్పై శాటిలైట్లను పంపుతున్నట్టు చెప్పారు. దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మాక్రన్​ అనుకుంటున్నట్టుగా సెప్టెంబర్​ 1 నుంచి స్పేస్​ కమాండ్​ పని ప్రారంభమవుతుందన్నారు. అంతరిక్షంలో ఉన్న తమ ఉపగ్రహాలను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకునేలా చిన్న చిన్న ఉపగ్రహాలను లేజర్​కక్ష్యలోకి వదులుతామన్నారు. ప్రత్యర్థి ఉపగ్రహాల నుంచి పొంచి ఉన్న ముప్పును పసిగట్టి వెంటనే దాడులు చేయడానికి రెడీ అవుతుందన్నారు.