
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో టాస్ సీడ్ ఇగా స్వైటెక్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆమెతో పాటు ఆరో సీడ్ కొకో గాఫ్ ముందంజ వేయగా.. వింబుల్డన్ చాంప్ ఎలినా రిబకినా అనారోగ్యం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో పోలెండ్ స్టార్ స్వైటెక్ 6–0, 6–0తో చైనా ప్లేయర్ వాంగ్ జిన్యును చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన పోరులో స్వైటెక్ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా మ్యాచ్ గెలిచింది.
అమెరికా టీనేజర్ గాఫ్ 6–7 (5/7), 6–1, 6–1తో రష్యాకు చెందిన 16 ఏండ్ల మిరా అండ్రీవాపై గెలిచింది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ రిబకినా (కజకిస్తాన్).. ప్రత్యర్థి సొరిబెస్ టొర్మో (స్పెయిన్)కు వాకోవర్ ఇచ్చింది. మెన్స్ సింగిల్స్‌లో నాలుగో సీడ్ కాస్పర్ రుడ్ (నార్వే) 4–6, 6–4, 6–1, 6–4తో జాంగ్ జిజెన్ (చైనా)పై, ఆరో సీడ్ హోల్డర్ రూనె (డెన్మార్క్) 6–4, 6–1, 6–3తో ఒలివెరి (అర్జెంటీనా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్ చేరారు. అయితే, తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–3, 3–6, 4–6, 5–7తో 23వ సీడ్ ఫ్రాన్సిస్కో సెరుండొలో (అర్జెంటీనా) చేతిలో ఓడి ఇంటిదారి పట్టాడు.