రోజ్​గోల్డ్​ బ్యూటీపార్లర్ల పేరుతో బురిడీ!

రోజ్​గోల్డ్​ బ్యూటీపార్లర్ల పేరుతో బురిడీ!
  • ఫ్రాంచైజీల పేరిట ఒక్కో షాప్​నుంచి  రూ.3 లక్షలు వసూలు
  • కాస్మోటిక్స్, రూ.35 వేలు జీతం ఇస్తామని మోసం
  • అప్పులు చేసి పైసలు కట్టిన బాధితులు
  • నిర్వాహకులపై పలు పీఎస్​లలో ఫిర్యాదులు, కేసులు

మెదక్/ కౌడిపల్లి, వెలుగు: బ్యూటీపార్లర్ బిజినెస్​ ద్వారా ఉపాధి కల్పిస్తామని, నెల నెలా జీతం ఇస్తామని చెప్పి ఓ ప్రైవేట్​సంస్థ నిరుద్యోగుల దగ్గరి నుంచి రూ.లక్షలు వసూలు చేసి మోసం చేసింది. ఆయా పోలీస్​స్టేషన్లలో బాధితుల ఫిర్యాదుల ప్రకారం...కామారెడ్డి జిల్లాకు చెందిన సమీనా అలియాస్​ ప్రియాంక, ఇస్మాయిల్ దంపతులు. వీరితో పాటు సమీనా అక్క దేవకి అలియాస్​ జెస్సికా ఏడాది కింద ‘రోజ్​గోల్డ్’ పేరుతో బ్యూటీపార్లర్ ​బిజినెస్​ ప్రారంభించారు. మొదట హైదరాబాద్​ ప్రగతి నగర్​లో సంస్థ ఆఫీస్​ఓపెన్​ చేశారు.

ఫ్రాంచైజీ ఏర్పాటు చేస్తే ట్రైనింగ్​ఇవ్వడంతోపాటు, అవసరమైన కాస్మోటిక్స్​ తామే సప్లై చేస్తామని, నెలకు రూ.35 వేల జీతం ఇస్తామని చెప్పడంతో  హైదరాబాద్ శివార్లలోని సూరారం, గాజులరామారం, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల పరిధిలో100 ఫ్రాంచైజీలు ఏర్పాటయ్యాయి.  దీని కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3 నుంచి రూ.3.20 లక్షల వరకు అడ్వాన్స్ గా తీసుకున్నారు. మెదక్ జిల్లాలో మెదక్​ టౌన్​తో పాటు మంబోజిపల్లి, చిన్నశంకరంపేట, కొల్చారం, కౌడిపల్లి, నర్సాపూర్​ తూప్రాన్​, టేక్మాల్​, పాపన్నపేట, పెద్దశంకరంపేట, సంగారెడ్డి జిల్లాలోని పటాన్​చెరు, జోగిపేట, నారాయణఖేడ్​ తదితర ప్రాంతాల్లో ఫ్రాంచైజీలు ఏర్పాటయ్యాయి.

మొదట్లో రెండు, మూడు నెలలు కాస్మోటిక్స్​ సప్లై చేశారు. నమ్మే విధంగా  జీతాలు కూడా ఇచ్చారు. తర్వాత బంద్​ చేయడంతో పాటు అడిగితే రేపు మాపు  అంటూ కాలం వెళ్లదీశారు. దీంతో కొందరు బాధితులు హైదరాబాద్​ ప్రగతి నగర్ లోని ఆఫీస్ కి వెళ్లగా తాళం వేసి ఉంది.  ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చాయి. పీఎస్​లో ఫిర్యాదు చేద్దాం అని అనుకునేంతలో విషయం తెలుసుకున్న సమీనా అలియాస్​ ప్రియాంక డబ్బులు చెల్లించడానికి టైం తీసుకుంది.

గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడం, సమీనా  ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, ఆఫీసుకు మళ్లీ తాళం వేసి ఉండడంతో బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రోజ్​గోల్డ్​ బ్యూటీపార్లర్ ​ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన వారు కూడా ఆయా పోలీస్​ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్​లు నమోదయ్యాయి.  అప్పులు చేసి, బంగారం అమ్మి కట్టామని ఇప్పుడు ఏం చేయాలో అ ర్థం కావడం లేదని బాధితులు మొత్తుకుంటున్నారు.  

గతంలోనూ మోసాలు ...

ఇస్మాయిల్ గతంలో కామారెడ్డి లో బీర్షాభా పేరుతో చైన్ లింక్ స్కీమ్ నిర్వహించి పలువురిని మోసగించగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.  స్కీమ్ లో మెంబర్​గా జాయిన్ అయి రూ.30 వేలు కడితే నెలకు రూ.10 వేల చొప్పున 6నెలలు ఇస్తామని నమ్మించారని, మరికొందరిని సభ్యులుగా చేర్పిస్తే కమిషన్ ఇస్తామని చీట్​ చేసినట్టు సమాచారం.