- లండన్ డాక్టర్స్ టీమ్ సహకారంతో ఈ నెల13 నుంచి సర్జరీలు
- అపాయింట్మెంట్ అవసరం లేకుండా వాక్- ఇన్ పద్ధతిలోనే చికిత్స
- చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, వ్యాధి అవసరాన్ని బట్టి ప్రయారిటీ
- వెల్లడించిన నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) హాస్పిటల్లో పిల్లలకు పూర్తి ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. సామాజిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా కార్డియో థొరాసిక్ సర్జరీ (సీటీ సర్జరీ) విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్ అమరేశ్వర్ నేతృత్వంలో ఈ సర్జరీలు జరగనున్నాయి.
లండన్‌కు చెందిన ప్రముఖ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ ధన్నపునేని ఆధ్వర్యంలోని బ్రిటన్ డాక్టర్లు, టెక్నికల్ టీమ్ సహకారంతో ఈ ఆపరేషన్లు నిర్వహించనున్నారు. గత ఐదేండ్లుగా యేటా నిమ్స్ హాస్పిటల్లో ఈ ఉచిత హార్ట్సర్జరీలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 13 నుంచి ఉచిత శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయని డైరెక్టర్ వెల్లడించారు.
ఈ ఉచిత గుండె ఆపరేషన్ల కోసం చిన్నారుల తల్లిదండ్రులు ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని హాస్పిటల్ యాజమాన్యం స్పష్టం చేసింది. నేరుగా హాస్పిటల్కు వస్తే డాక్టర్లు చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు. ప్రతి చిన్నారి వ్యాధి తీవ్రత, ఎమర్జెన్సీని బట్టి ప్రాధాన్యత కేటాయిస్తారు. హాస్పిటల్ కు వచ్చిన చిన్నారులకు మొదట ఉచితంగా అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, శస్త్రచికిత్స అవసరమున్న పిల్లలకు ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా పూర్తి ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తారు.
పాత రిపోర్టులు వెంట తెచ్చుకోవాలి
అర్హులైన చిన్నారుల తల్లిదండ్రులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్ హాస్పిటల్కు నేరుగా వచ్చి సంప్రదించవచ్చని తెలిపారు. పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ ఓల్డ్ బ్లాక్, మొదటి అంతస్తులో ఉన్న సీటీ సర్జరీ ఆఫీసులో అందుబాటులో ఉండే డాక్టర్లు ప్రవీణ్, గోపాల్‌ను నేరుగా కలవవచ్చు.
చిన్నారులను తీసుకొచ్చే సమయంలో పాత హెల్త్ రిపోర్టులు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం సీటీ సర్జరీ కార్యాలయానికి చెందిన 040-23489025లో సంప్రదించవచ్చని నిమ్స్ యాజమాన్యం ప్రకటించింది.
