మేడారం స్పెషల్ బస్సుల్లోనూ..మహిళలకు ఫ్రీ జర్నీ

మేడారం స్పెషల్ బస్సుల్లోనూ..మహిళలకు ఫ్రీ జర్నీ
  •    జాతర పనుల్లో నాణ్యతపై రాజీపడేది లేదు 
  •     కాంట్రాక్టర్లకు వంతపాడితే చర్యలు  
  •     మేడారంలో మంత్రులు సీతక్క, సురేఖ
  •     జాతర పనుల పరిశీలన..ఆఫీసర్లతో సమీక్ష

జయశంకర్‌‌ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు :  ఫ్రీ బస్​జర్నీ సౌకర్యాన్ని మేడారం జాతరకు నడిపే స్పెషల్​ బస్సుల్లోనూ అమలు చేస్తామని రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ స్పష్టంచేశారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా గతంలో కంటే 2 వేల బస్సులను ఎక్కువగా నడుపుతామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ మహా జాతరపై ఆఫీసర్లతో మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

అంతకుముందు రూ.20 లక్షలతో నిర్మించిన సానిటేషన్ షెడ్ ను మంత్రి సీతక్క ప్రారంభించగా, మేడారం పూజారుల కోసం దేవాదాయ శాఖ నిధులు రూ.1.5 కోట్లతో నిర్మించనున్న ప్రత్యేక అతిథి గృహ సముదాయ పనుల శిలాఫలకాన్ని మంత్రి సురేఖ ఆవిష్కరించారు. ముందుగా ఇద్దరు మంత్రులు మేడారం అమ్మలకు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మేడారంలో రూ.75 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. 

అవసరమైతే మరో రూ.35 కోట్లు...

రూ.75 కోట్లతో చేపట్టే మహాజాతర అభివృద్ధి పనుల నాణ్యతపై రాజీ పడేది లేదని మంత్రులు సీతక్క, సురేఖ స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు వంతపాడితే ఆఫీసర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కానివ్వమని, శాశ్వత పనులు చేపట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మేడారం మహా జాతరకు కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శానిటేషన్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదన్నారు.

ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు జరిగేలా చూడాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. జాతర అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే రూ.75కోట్లను విడుదల చేసిన సీఎం రేవంత్‌‌రెడ్డి.. మరో రూ.35 కోట్లను కూడా రిలీజ్‌‌ చేసే అవకాశం ఉందన్నారు.  

జాతీయహోదా కోసం కృషి చేస్తాం :  మంత్రి సీతక్క

మేడారం మహాజాతరను జాతీయ పండుగగా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని మంత్రి సీతక్క అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జాతీయ హోదా కోసం కృషి చేయాలని కోరారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఆడబిడ్డలుగా తాము మేడారం జాతరను విజయవంతం చేసేందుకు పట్టుదలతో పని చేస్తామన్నారు. 2014 మేడారం మహా జాతరలో సమ్మక్క-సారలమ్మలు గద్దెనెక్కిన రోజు, తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదమైన రోజు ఒక్కటే అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కూడా తల్లుల దీవెనలతోనే ఏర్పడిందన్నారు.  

యాదాద్రి మూలవిరాట్‌‌ను కదిలించడం తప్పు : మంత్రి సురేఖ

గత ప్రభుత్వ హయంలో యాదాద్రి దేవాలయంలో అభివృద్ధి పనుల పేరిట మూల విరాట్‌ను కదిలించి యాదాద్రిని నిర్మించారని, అది శాస్త్ర పరంగా తప్పని మంత్రి కొండా సురేఖ అన్నారు. గిరిజన జాతరలో పూజారుల పాత్ర కీలకమని, వారి కోసం ప్రభుత్వం 10 గదుల​తో అతిథి గృహం నిర్మిస్తోందని, వచ్చే మినీ జాతర నాటికి గెస్ట్​హౌస్​ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రతిపక్షాలకు విమర్శించే హక్కు లేదని, సలహాలు, సూచనలు అందించి జాతర విజయవంతానికి సహకరించాలని కోరారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శభరిశ్, ఫారెస్ట్​ఆఫీసర్​రాహుల్ కిషన్ జాదవ్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, అడిషనల్​కలెక్టర్​( స్థానిక సంస్థలు ) పి శ్రీజ , అడిషనల్​కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, దేవాదాయ శాఖ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.