
- ఏడాది పాటు ఇంతే.. ఆరు కిలోల రేషన్‌కు చెల్లుచీటి
- నెలకు రూ.150 కోట్ల భారాన్ని తగ్గించుకున్న సర్కారు
- రేపటి నుంచే రేషన్ పంపిణీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉచిత రేషన్ 5 కిలోలకే పరిమితం కానుంది. గతంలో అమలు చేసిన తలా 6 కిలోల బియ్యం పంపిణీకీ సర్కారు చెల్లుచీటీ ఇచ్చింది. ఈ నెల నుంచి ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జాతీయ ఆహార భద్రతా కార్డు(ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ)లతో పాటు రాష్ట్ర సర్కారు జారీ చేసిన ఫుడ్ సెక్యూరిటీ కార్డు దారులందరికీ తలా ఐదుకిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ జరగనుంది. ఫలితంగా రాష్ట్ర సర్కారుకు రూ.150 కోట్లకు పైగా సబ్సిడీ భారం తగ్గనుంది.
గతంలో ఇలా..
గతంలో కేంద్రం కిలో రూ.32 చొప్పున బియ్యాన్ని సేకరించి దానిలో రూ.29 సబ్సిడీ భరించి కిలో రూ.3కు తలా 5 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేసేది. రాష్ట్ర సర్కారు రూ.2 సబ్సిడీ భరించి రూపాయికి కిలో చొప్పున 6 కిలోల బియ్యాన్ని అందించేది. అయితే, కరోనా నేపథ్యంలో కేంద్రం గరీబ్ కల్యాణ్ యోజన అమలు చేసి అదనంగా 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ప్రకటించింది. దీంతో రాష్ట్రం కూడా అదనపు కోటా అమలు చేయడం ద్వారా పేద కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ10 కిలోల బియ్యం ఉచితంగా అందేవి.
ప్రస్తుతం ఇలా..
ఈ నెల నుంచి ఏడాది పాటు రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని రాష్ట్ర సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. దీంతో గతంలో అందించిన 6 కిలోల రేషన్ బియ్యానికి రాష్ట్ర సర్కారు కిలో కోత పెట్టినట్లయింది. డిసెంబరు 23న ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశమై దేశవ్యాప్తంగా ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ కార్డుదారులందరికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీని ఈ జనవరి1 నుంచి 2023 డిసెంబర్ వరకు ఏడాదిపాటు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర సర్కారు కేంద్రం అందించిన 55 లక్షల ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ కార్డుదారులతో పాటు రాష్ట్రం అందిస్తున్న 35 లక్షల ఆహార భద్రతా కార్డుదారులకు నెలకు 5 కిలోల ఉచిత బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర కోటాలో 6 కిలోల బియ్యంలోనూ కిలో తగ్గించడంతో భారం తప్పింది.
సబ్సిడీ భారం తగ్గించుకున్న సర్కార్
కేంద్రం గతంలో కిలో బియ్యం రూ.3లకే తలా 5 కిలోల చొప్పున 55 లక్షల కార్డులకుగాను 1.91 కోట్ల మందికి నెలకు 1.08 లక్షల టన్నులు కేటాయించేది. రాష్ట్రం కిలోకు రూ.2 సబ్సిడీ భరించేది. దీనికి అదనంగా ఒక్కొక్కరికి కిలో బియ్యం పంపిణీ చేసేది. ఇప్పుడు ఈ కార్డుదారులందరికీ కేంద్రం ఉచితంగా ఇస్తుండడం, రాష్ట్రం అదనపు కిలో భరించకుండా యథాతథంగా అమలు చేయడంతో నెలకు అదనపు భారం తగ్గించుకున్నట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 35 లక్షలకు పైగా కార్డులకు 90 లక్షల మందికి రాష్ట్రమే మొత్తం రూ.32 సబ్సిడీ భరించి తలా 6 కిలోల చొప్పున 54 వేల టన్నుల బియ్యాన్ని అందించేది. కానీ ఇప్పుడు దాన్ని 5 కిలోలకే పరిమితం చేసింది. దీంతో 9 వేల టన్నుల బియ్యం ఆదా జరిగింది. ఇలా సబ్సిడీ బియ్యం భారం నెలకు రూ. 150 కోట్లకు పైగా (సగానికి సగం) తగ్గినట్లయింది. కాగా, రేషన్ పంపిణీ గురువారం నుంచే చేపట్టాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించినా టెక్నికల్ ప్రాబ్లంతో పంపిణీ నిలిచిపోయింది. శనివారం నుంచే రేషన్ పంపిణీ చేపట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.