- 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్‌తో ఫ్రీగా ట్రీట్‌మెంట్
- ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అందరూ అర్హులే
- ఇప్పటికే ఉన్న రోగాలకూ ఇన్సూరెన్స్ కవరేజ్
బిజినెస్‌డెస్క్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల హాస్పిటల్ ఖర్చులను తగ్గించేందుకు ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్‌ను తాజాగా తీసుకొచ్చింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం–జేఏవై) కింద ఇప్పటికే బెనిఫిట్స్ పొందుతున్న సీనియర్ సిటిజన్స్ కూడా ఈ కొత్త స్కీమ్ కింద అదనంగా రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ పొందొచ్చు.
పీఎం–జేఏవై కింద కేవలం ఆర్థికంగా వెనుకబడిన వారు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ పొందడానికి వీలుండగా, ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ ద్వారా 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు ఎవరైనా ప్రయోజనం పొందొచ్చు. ఆధార్ కార్డ్‌లోని డేట్ ఆఫ్ బర్త్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. అర్హత ఉన్న సీనియర్ సిటిజన్స్ ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డులను పొందాలంటే ఆధార్ నెంబర్‌తో ఈ–కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి.
డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి రోగాలకు ఫ్రీగా ట్రీట్‌మెంట్
ఆయుష్మాన్ వయో వందన కార్డులు ఉన్నవారు ప్రభుత్వ హాస్పిటల్స్, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఫ్రీగా చికిత్స పొందొచ్చు. ఇప్పటికే ఉన్న రోగాలకు కూడా చికిత్స పొందొచ్చు. డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి తీవ్ర రోగాలకూ ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు.
ఇలా అప్లయ్ చేసుకోవాలి..
- ఆయుష్మాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. బెనిఫిసరీగా లాగిన్ అవ్వాలి.
- క్యాప్చా, మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి, ఏ విధానంలో అథంటికేషన్‌ను పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. క్యాప్చా సెలెక్ట్ చేసి లాగిన్ అవ్వాలి.
- లబ్ధిదారుని వివరాలను, ఆధార్ వివరాలను ఎంటర్ చేయాలి. బెనిఫిసరీ వివరాలు కనిపించకపోతే, ఈకేవైసీ ప్రాసెస్‌ను ఫాలో అయ్యి, ఓటీపీ ద్వారా అథంటికేషన్‌ను పూర్తి చేయాలి.
- ఫొటో తీసుకోవాలి. అర్హత ఉందనే డిక్లరేషన్‌ను పూర్తి చేయాలి. ఇతర అప్లికేషన్‌ను నింపాలి.
- బెనిఫిసరీ మొబైల్ నెంబర్, ఓటీపీ నింపాలి. కేటగిరీ, పిన్ నెంబర్ వంటి ఇతర వివరాలను నింపాలి.
- ఫ్యామిలీ మెంబర్స్ వివరాలనూ నింపాక, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ–కేవైసీ పూర్తయ్యాక, ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరికొన్ని అంశాలు..
- బెనిఫిసరీ డాట్ ఎన్‌హెచ్‌ఏ డాట్ జీఓవీ డాట్ ఇన్ (beneficiary.nha. gov.in) వెబ్‌సైట్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ల దగ్గర కూడా వయో వందన కార్డు కోసం అప్లయ్ చేసుకోవచ్చు. హాస్పిటల్‌లో జాయిన్ అవుతున్న టైమ్‌లో కూడా ఈ కార్డు కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
- సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్‌ఎస్) లేదా ఇతర ప్రభుత్వం హెల్త్ స్కీమ్‌ల ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు ఆయుష్మాన్ వయో వందనకు అర్హులే. అయినప్పటికీ, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండు స్కీమ్‌ల కింద ఒకేసారి బెనిఫిట్ పొందడానికి వీలుండదు.
- ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారు ఈ స్కీమ్ కింద కూడా ప్రయోజనం పొందొచ్చు. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందుతున్నవారు, వయో వందన కింద కూడా ఏకకాలంలో ప్రయోజనం పొందొచ్చు.