మీకు తోడు మేమున్నాం.. క్యాన్సర్ పేషెంట్లకు ఫ్రీ విగ్స్..

మీకు తోడు మేమున్నాం.. క్యాన్సర్ పేషెంట్లకు ఫ్రీ విగ్స్..

ప్రస్తుతం క్యాన్సర్ తో బాధపడేవాళ్ల సంఖ్య బాగా పెరిగింది. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే చాలా మంది తమ జుట్టును కోల్పోతున్నారు. కొందరు విగ్ లు పెట్టుకుంటారు. కానీ, క్యాన్సర్ తో బాధపడే పేదవాళ్లు వేల రూపాయలు పెట్టి విగ్ కొనుక్కోలేక లోలోపలే కుమిలిపోతుంటారు. విగ్ కొనాలంటే రూ.25 వేల నుంచి 40వేల పైనే ఖర్చు అవుతుంది.

ట్రీట్మెంట్ కే అప్పులు చేసేవాళ్లు అన్ని డబ్బులు పెట్టి విగ్ కొనలేరు. అలాంటివాళ్లను చూసి ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ అయిన శివకి ఓ ఆలోచన వచ్చింది. విగ్ లు తయారుచేసి ఇస్తే క్యాన్సర్ పేషెంట్ల జీవితంలో సంతోషాలు నింపొచ్చని అనుకున్నాడు. 2019లో 'హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్' ఎన్జీవో పెట్టాడు. 

అవేర్ నెస్ పెరిగింది..

మొదట్లో వారానికి ఒకరిద్దరు మాత్రమే హెయిర్ డొనేట్ చేసేందుకు వచ్చేవాళ్లు. అవేర్ నెస్ పెరిగాక హెయిర్ డొనేట్ చేసేవాళ్ల సంఖ్య పెరిగింది. పిల్లలు, యంగ్ స్టర్స్, హౌజ్ వైవ్స్ జుట్టు ఇచ్చేందుకు ముందుకు వస్తుండడం విశేషం. కొందరు గుండు చేయించుకుని జుట్టు డొనేట్ చేస్తున్నారు. ఒకప్పటితో పోల్చితే హెయిర్ డొనేషన్ మీద అవేర్నెస్ పెరిగింది. 

సొంత డబ్బు, డోనర్ల సాయంతో... 

హెయిర్ డొనేట్ చేయాలనుకునేవాళ్లు శివ ఆఫీసుకివెళ్తే అతనే జుట్టు కట్ చేస్తాడు. ఆ హెయిర్ని క్లీన్ చేసి, విగ్ తయారీకి పనికొచ్చే హెయిర్ని సపరేట్ చేస్తాడు. తన టీమ్ తో కలిసి అక్కడే ఆ జుట్టుతో విగ్ తయారుచేస్తాడు. విగ్ల తయారీ కోసం తన ఆదాయంలో కొంత, డోనర్స్ ఇచ్చిన ఫండ్స్ కొంత ఖర్చు చేస్తున్నాడు శివ. 

ఎంతదూరమైనా వెళ్లి ఇస్తారు..

సోషల్ మీడియా, వెబ్ సైట్ల ద్వారా శివను కాంటాక్ట్ అవుతున్నారు చాలామంది. హైదరాబాద్లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో, పొరుగు రాష్ట్రాల్లోనూ ఫ్రీగా విగ్ లు పంచుతున్నారు ఈ సంస్థ వాళ్లు. క్యాన్సర్ హాస్పిటల్స్ లో సంస్థ డీటెయిల్స్ ఉంచుతారు. విగ్ కావాల్సిన వాళ్లు ఫోన్ చేస్తే, వాళ్ల వివరాలు తెలుసుకొని నేరుగా వెళ్లి విగ్స్ ఇస్తున్నారు. 

చాలా హ్యాపీగా ఉన్నారిప్పుడు..

జుట్టు లేకుండా బాధపడ్డవాళ్లు ఇప్పుడు శివ ఇచ్చిన విగ్స్ పెట్టుకుని సంతోషంగా ఉన్నారు. వీళ్లలో ఒకరు మల్కాజిగిరికి చెందిన ఉమ. క్యాన్సర్ తో ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. కీమోథెరపీ వల్ల హెయిర్ మొత్తం పోయింది. రెండు నెలల క్రితం బంధువుల ద్వారా 'హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ' సంస్థ గురించి తెలుసుకుని, వాళ్లని కలిసి విగ్ తెచ్చుకుంది. విగ్ పెట్టుకోవడంతో కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్పింది ఉమ. ఎల్బీనగర్ లో ఉంటున్న లక్ష్మీది కూడా అచ్చం ఉమలాంటి కథే . ఆమెకి అలోపేసియా అనే ఆటోఇమ్యూన్ డిసీజ్ కారణంగా జుట్టు ఊడిపోయింది. దాదాపు పదేండ్లు సఫర్ అయింది. యూట్యూబ్ లో 'హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్' సంస్థ గురించి తెలిసింది. దాంతో వాళ్లకి ఫోన్ చేసి మరుసటి రోజే విగ్ తెచ్చుకుంది లక్ష్మి.

సోషల్ మీడియాలో చూసి.. 

"నాకు సోషల్ సర్వీస్ చేయడం ఎలా చేయాలో తెలియదు. ఓసారి సోషల్ మీడియాలో హెయిర్ డొనేషన్ చేయడం వల్ల క్యాన్సర్ పేషెంట్లకు అవసరమయ్యే విగ్స్ తయారీకి హెల్ప్ అవుతుందనే న్యూస్ చూశాను. వెంటనే ఆ సంస్థకు కాల్ చేసి జుట్టు డొనేట్ చేశాను. సోషల్ సర్వీస్ చేయాలనే నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది". -అలివేలు, చందానగర్..

ఒక విగ్ కి నాలుగు వేల ఖర్చు

క్యాన్సర్, ఇతర వ్యాధుల కారణంగా జుట్టు కోల్పోయి, విగ్ కొనేందుకు డబ్బులు లేని పేదవాళ్లు మా నెంబర్ 9666406586కి ఫోన్ చేస్తే, ఫ్రీగా విగ్ ఇస్తాం. 'హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ' ఫేస్బుక్ పేజీ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వొచ్చు. డోనర్స్ నుంచి 12 ఇంచుల పొడవు జుట్టు తీసుకుంటాం. ఒక విగ్ చేయడానికి 4 రోజులు పడుతుంది. అందుకు ఏడు పోనీ టెయిల్స్ అవసరం. అంతేకాదు 4వేల వరకు ఖర్చు అవుతుంది. హెయిర్ డొనేట్ చేయలేని వాళ్లు మనీ ఇవ్వొచ్చు. అందుకోసం 'స్పాన్సర్ ఏ విగ్ కాన్సెప్ట్'ని మొదలుపెట్టాం. ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా 50కి పైగా విగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం".  -శివ, ఫౌండర్, హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్.