ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఫ్రెష్ వర్క్స్ (Freshworks) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో సుమారు 11 శాతం అంటే దాదాపు 500 మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ డెన్నిస్ వుడ్ సైడ్ ప్రకటించారు. ఈ మేరకు మే 6న ఆయన ఉద్యోగులందరికీ ఒక లెటర్ రాశారు.
ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నారంటే
కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణాలను సీఈఓ లేఖలో వివరిస్తూ... ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచం వేగంగా AI వైపు మారుతోంది. ఈ మార్పులకు అనుగుణంగా కంపెనీని రెడీ చేయడానికి ఈ పునర్వ్యవస్థీకరణ తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. సంస్థ వృద్ధిని పెంచే కీలక విభాగాలపై దృష్టి పెట్టడానికి, పర్ఫార్మెన్స్ మెరుగుపరచుకోవడానికి ఈ మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
ఎవరిపై ప్రభావం పడనుందంటే
భారతదేశం సహా ఉత్తర అమెరికా ప్రాంతాల్లోని ఏ ఉద్యోగుల పై ప్రభావం ఉంటుందో మరో 30 నిమిషాల్లో ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుందని కంపెనీ స్పష్టం చేసింది. స్థానిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో ఆయా దేశాల్లోని సిబ్బందికి సమాచారం ఇస్తారు. ఏ విభాగాల్లో తొలగింపులు ఉంటాయనేది మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.
తొలగించిన వారికి కంపెనీ భరోసా
అయితే ఉద్యోగం కోల్పోయే వారికి అండగా ఉంటామని సీఈఓ హామీ ఇచ్చారు. అలాగే వారికీ కొన్ని ప్రయోజనాలు కూడా కల్పిస్తామన్నారు. నష్టపరిహారం కింద కంపెనీలో పనిచేసిన కాలాన్ని బట్టి సెవరెన్స్ పే ఇవ్వనున్నారు. అలాగే 2026 మొదటి త్రైమాసికానికి (Q1) సంబంధించిన బోనస్‌లు చెల్లిస్తారు. ఆరోగ్య బీమా పరంగా హెల్త్ కేర్ కవరేజీని మరికొంత కాలం పొడిగిస్తారు. కొత్త ఉద్యోగం కోసం సాయం చేసేందుకు కెరీర్ సర్వీసెస్, కొత్త ఉద్యోగాల్లో చేరడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తారు.
సంస్థ భవిష్యత్తుపై ధీమా
నిర్మాణాత్మక మార్పులు జరిగినప్పటికీ, కంపెనీ లక్ష్యం, వ్యూహంలో ఎలాంటి మార్పు లేదని వుడ్ సైడ్ స్పష్టం చేశారు. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం, AI విభాగంలో అగ్రగామిగా ఎదగడంపైనే మా దృష్టి ఉంటుందని ఆయన తెలిపారు. మా సంస్థ ప్రయాణంలో భాగమైనందుకు ప్రతి ఉద్యోగికి, అయన ధన్యవాదాలు తెలిపారు.
