ఎఫ్​ఆర్వోది ప్రభుత్వ హత్యే. కేసీఆర్​ బాధ్యత వహించాలి: రేవంత్​

ఎఫ్​ఆర్వోది ప్రభుత్వ హత్యే. కేసీఆర్​ బాధ్యత వహించాలి: రేవంత్​
  • పోడు సమస్య పరిష్కారం కాకపోవడంతోనే ఈ పరిస్థితి
  • వెంటనే లబ్ధిదారులకు పట్టాలివ్వాలని సీఎంకు లేఖ

హైదరాబాద్, వెలుగు: ఫారెస్ట్​ రేంజ్​ఆఫీసర్​ శ్రీనివాసరావుది ప్రభుత్వ హత్యేననీ, దానికి సీఎం కేసీఆర్​ బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. పోడు భూముల సమస్యను సర్కారు పరిష్కరించకపోవడం వల్లే అటవీ శాఖ అధికారులకు, గిరిజనులకు మధ్య గొడవలు జరిగి ప్రాణాలు పోతున్నాయన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు రేవంత్​రెడ్డి బుధవారం లేఖ రాశారు. పోడు భూములపై హక్కులు కల్పిస్తామని కేసీఆర్​ ఎనిమిదేండ్లుగా లబ్ధిదారులను ఊరిస్తున్నారని, మరోవైపు అటవీ శాఖ అధికారులను రెచ్చగొట్టి గిరిజనులపై దాడులకు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. పోడు భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సర్కారు ఫారెస్టు అధికారులకు అప్పజెప్పిందని, దాన్ని గిరిజనులు అడ్డుకుంటూ వస్తున్నారన్నారు.

దీంతో అటవీ ప్రాంతంలో గొడవలు జరుగుతున్నాయన్నారు. కొందరు ప్రజాప్రతినిధులు కూడా అధికారులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని 2018 ఎన్నికల్లో ఆదిలాబాద్​ నుంచి ఖమ్మం వరకు జరిగిన ప్రతి సభలో కేసీఆర్ హామీ ఇచ్చారని, పోడు భూములకు పట్టాలిస్తామని అసెంబ్లీలో ప్రకటించి మూడేండ్లు అవుతోందన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్​ చైర్మన్​గా కమిటీ వేసి ఏడాది అయిందని, ఇంత వరకు అది అతీగతీ లేదన్నారు. ఎఫ్​ఆర్​ఓపై గుత్తి కోయల దాడి తప్పేనని, అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం కావాలంటే వెంటనే పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్​ చేశారు. శ్రీనివాసరావు కుటుంబానికి ఐదు కోట్ల రూపాయల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని, అటవీ శాఖ అధికారులకు రక్షణ కల్పించాలని రేవంత్​ లేఖలో పేర్కొన్నారు.