సిలిగురి కారిడార్ - భారతదేశ భౌగోళిక పటంలో వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా అత్యంత కీలకమైన అలాగే సున్నితమైన ప్రాంతం. పశ్చిమ బెంగాల్‌లోని ఈ ఇరుకైన భూభాగాన్ని 'చికెన్స్ నెక్' అని పిలుస్తారు. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రాంతం, భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో (సెవెన్ సిస్టర్స్) కలుపుతోంది. ఇటీవల బంగ్లాదేశ్‌లోని మధ్యంతర నాయకత్వం నుంచు వస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఈ కారిడార్‌ను దిగ్బంధిస్తామనే హెచ్చరికలపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు చేసిన విశ్లేషణ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బంగ్లాదేశ్ నేత ముహమ్మద్ యూనస్ గతంలో చైనా పర్యటనలో చేసిన వ్యాఖ్యలను సద్గురు ప్రస్తావిస్తూ.. భారత్ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదని, బంగ్లాదేశ్ మాత్రమే ఆ ప్రాంతానికి సముద్ర ద్వారమని యూనస్ కామెంట్ చేయటం వెనుక భౌగోళిక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. శత్రు దేశాలు లేదా పొరుగు దేశాలు మన దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసే వరకు వేచి చూడటం తెలివైన పని కాదని, ఆ దిశగా భారత్ తన రక్షణ వ్యూహాలను పటిష్టం చేసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా.. భారతదేశ విభజన సమయంలో జరిగిన చారిత్రక తప్పిదాలను సద్గురు ఎత్తి చూపారు. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న దారితో ఒక దేశాన్ని నిర్మించడం సరైన విధానం కాదని అన్నారు. 1947లో మనకు అవకాశం లేకపోయినా.. 1972లో బంగ్లాదేశ్ విముక్తి సమయంలో ఈ భౌగోళిక లోపాన్ని సరిదిద్దే అధికారం భారత్‌కు ఉండేదని, కానీ అప్పుడు ఆ అవకాశం చేజార్చుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఆ 'కోడి మెడ'ను.. ఏకంగా 'ఏనుగు మెడ'గా మార్చాల్సిన సమయం వచ్చేసిందని అభిప్రాయపడ్డారు.
ఆ ఇరుకైన ప్రాంతాన్ని రక్షణ పరంగా, వ్యూహాత్మకంగా మరింత దృఢంగా మార్చాలని ఆయన ఉద్దేశం. ఒక దేశం కేవలం ఆశయాలతో నడవదని, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం సరిహద్దులు లేని ఒకే కుటుంబంలా ఉండాలనేది గొప్ప ఆశయమే అయినప్పటికీ.. నేటి పరిస్థితుల్లో దేశ రక్షణే ముఖ్యమన్నారు. యూరప్ దేశాలు యుద్ధాల తర్వాత ఎలాగైతే ఐక్యంగా మారాయో, భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రావొచ్చని చెప్పారు.
