"బాస్ నాకు పెళ్లి కుదిరింది. 25 లక్షలు ఆఫర్ చేస్తున్నారు. సో జాబ్ మానేస్తా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి సెలక్ట్ ఒక కుర్రాడు తన మేనేజర్‌తో అన్న మాటలివి". నెలకు వచ్చే జీతం రూ.35 వేలే అయినా, గవర్నమెంట్ నౌకరీ రాగానే అతని కట్నం వాల్యూ రాత్రికి రాత్రే పెరిగిపోయింది. భారతదేశంలో కట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరమే కావచ్చు. కానీ పెళ్లిళ్ల మార్కెట్లో చదువు, ఉద్యోగాన్ని బట్టి నడిచే ఈ కట్నాల వ్యవహారం నేటికీ పక్కాగా అమలవుతోంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ, ఎంబీఏ.. ఇలా డిగ్రీల బరువును బట్టి వరుడి ధర కోట్లలో పలుకుతోంది.
ఇందులో అగ్రస్థానం ఎప్పుడూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులదే. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వీరికి రూ.కోటి నుండి రూ.5 కోట్ల వరకు కట్నంగా ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక యూపీఎస్సీ ఫలితాలు రాగానే రాత్రికి రాత్రే కొందరు కోటీశ్వర వరులుగా మారిపోతున్నారు. ఇక ఐఐటీ గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల రేటు రూ.20 లక్షల నుండి రూ.కోటి వరకు పలుకుతోంది. ప్రైవేట్ కార్పొరేట్ ఉద్యోగులకైతే వారి జీతం ప్యాకేజీని బట్టి కట్నం ప్యాకేజీ డిసైడ్ అవుతోంది. ఈ రోజుల్లో అబ్బాయికి వచ్చే ప్రభుత్వ ఉద్యోగం కట్నాన్ని అమాంతం పెంచేసేలా పనిచేస్తోంది.
పెళ్లికొడుకు విద్యా అర్హత పెరిగేకొద్దీ కట్నం డిమాండ్ కూడా పెరుగుతోందట. విచిత్రం ఏంటంటే తల్లిదండ్రులు అమ్మాయిల చదువుల కోసం కూడా లక్షలు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. అమ్మాయిలు కూడా ఐఐటీ, ఎంబీఏలు చదివి కార్పొరేట్ ఆఫీసుల్లో అబ్బాయిలతో సమానంగా.. అంతకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అయినా సరే పెళ్లి సమయానికి వచ్చేసరికి అబ్బాయి రేంజ్ ఎక్కువ అంటూ అమ్మాయి వైపు వారే అదనంగా సమర్పించుకోవాల్సి వస్తోందట. పట్టణాల్లో ఈ కట్నం కాస్తా గిఫ్ట్‌లు, లగ్జరీ వెడ్డింగ్స్, స్టేటస్ మ్యాచింగ్ అనే కొత్త కొత్త పేర్లతో చలామణి అవుతోంది.
ALSO READ : భూమిలో తవ్వితే బయటపడ్డ నోట్ల కట్టలు
ఈ ధోరణి కేవలం వ్యాపార లావాదేవీగా మిగిలిపోవడం లేదు, ఎందరో మహిళల ప్రాణాలను బలితీసుకుంటోంది. NCRB లెక్కల ప్రకారం.. భారతదేశంలో రోజుకు సగటున 16 మంది మహిళలు కట్నం వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. చదువు సంస్కారాన్ని ఇవ్వాలి కానీ ఇక్కడ డిగ్రీలు పెరిగేకొద్దీ కట్నం ఆశలు పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతున్న ఆధునిక భారతదేశంలో.. సమానంగా చదువుకున్న అమ్మాయి, అబ్బాయి పెళ్లి పీటలు ఎక్కేటప్పుడు అమ్మాయి కుటుంబమే ఎక్స్‌ట్రా పేమెంట్ చేయాల్సి వస్తోంది. హ్యాష్‌ట్యాగ్‌లతో గ్రాండ్‌గా జరిగే ఆధునిక పెళ్లిళ్ల వెనుక.. ఇంకా పాతకాలపు బేరసారాలే నడుస్తున్నాయనడానికి ఇది నిరూపిస్తోంది.
