ఉత్తరకొరియా నుంచి వార్తలు, ఫొటోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. నార్త్ కొరియా అనగానే అక్కడి అధ్యక్షుడు, నియంత కిమ్ అని ఠక్కున గుర్తుకొస్తాడు.. కిమ్ ఎన్నాళ్లు ఉంటాడు.. ఏదో ఒక రోజు పోతాడు కదా.. ఆ తర్వాత ఉత్తర కొరియా.. కిమ్ వారసులు ఎవరు.. ఈ ప్రశ్నలకు సమాధానంగా ఇటీవల బయటకు వస్తున్న ఫొటోలు ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవల కాలంలో కిమ్ పాల్గొనే వేడుకలు, సైన్యం కవాతుల్లో.. ఓ పాప తరచుగా కనిపిస్తుంది. ఈ పాప ఎవరు.. కిమ్ పక్కనే ఎందుకు కనిపిస్తుంది.. ఈ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కుటుంబం అంటేనే ఒక పెద్ద రహస్యం. కానీ, గత కొన్నేళ్లుగా కిమ్ అతని కుమార్తె 'జు ఏ'ను ప్రపంచానికి పరిచయం చేస్తున్న తీరు చూస్తుంటే, ఆమెనే తర్వాతి నాయకురాలు కావచ్చని అందరూ భావిస్తున్నారు.
ఆమె గురించి ఎలా తెలిసింది:
2013లో అమెరికా బాస్కెట్బాల్ ప్లేయర్ డెన్నిస్ రాడ్మన్ ఉత్తర కొరియా వెళ్ళినప్పుడు, అతను కిమ్ పాప 'జు ఏ'ను ఎత్తుకున్నానని చెప్పాడు. అలా మొదటిసారి ఆమె పేరు బయటకు వచ్చింది. ఆ తర్వాత పదేళ్ల వరకు ఆమె ఎక్కడుందో, ఏం చేస్తోందో ఎవరికీ తెలియదు.
ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన ఎంట్రీ:
2022 నవంబర్లో ఒక భారీ క్షిపణి ప్రయోగం వద్ద కిమ్ తన కూతురి చేయి పట్టుకుని కెమెరాలకు చిక్కాడు. ఒక చిన్న పాప మిస్సైళ్ల మధ్య కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి నుండి సైనిక పరేడ్లు, పెద్ద పెద్ద విందులలో ఆమె తండ్రి పక్కనే కనిపిస్తోంది. అక్కడి మీడియా ఆమెను 'గౌరవనీయమైన కుమార్తె' అని పిలవడం మొదలుపెట్టింది.
జు ఏ విలాసవంతమైన జీవితం:
ఆమె బయట స్కూళ్లకు వెళ్లదు, ఇంట్లోనే చదువుకుంటుంది. జు ఏకు గుర్రపు స్వారీ, స్కీయింగ్ ఇంకా ఈత కొట్టడం అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. ఆమెకు ఇప్పుడు సుమారు 12 నుండి 13 ఏళ్ల వయస్సు ఉండవచ్చు.
►ALSO READ | ప్రపంచ దేశాలు షాకయ్యే వార్త: సౌదీ దగ్గర అణ్వాయుధాలు.. ఇది పాకిస్తాన్ పనే..?
ఆమెనే తర్వాతి 'బాస్' అవుతారా:
ఉత్తర కొరియాలో కిమ్ కుటుంబం అంటే దైవంతో సమానంగా చూస్తారు. కిమ్ తర్వాత అధికారం తన కుటుంబంలోనే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ దేశం మగవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సమాజం. కాబట్టి ఒక మహిళను నాయకురాలిగా ప్రజలు అంగీకరించేలా చేయడానికి కిమ్ ఇప్పటి నుండే ఆమెను అందరికీ అలవాటు చేస్తున్నాడని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం జు ఏ కేవలం ఒక చిన్నారిగా కనిపిస్తున్నా, కిమ్ పక్కన ఆమె నిలబడే తీరు చూస్తుంటే భవిష్యత్తులో ఆమె ఒక శక్తివంతమైన నాయకురాలిగా మారే అవకాశం కనిపిస్తోంది.
