స్వీపర్ నుంచి క్రికెటర్ దాకా.. ఎవరీ రింకు సింగ్?

స్వీపర్ నుంచి క్రికెటర్ దాకా.. ఎవరీ రింకు సింగ్?

రింకు సింగ్.. ఏ క్రికెట్ లవర్ నోట విన్నా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. ఓడిమి అంచుల్లో ఉన్న కోల్ కత్తా నైట్ రైడర్స్ ను తన బ్యాటింగ్ తో విజయాన్ని అందించాడు ఈ ఇరవై ఐదేళ్ళ కుర్రాడు. చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాది.. అద్భుత విజయాన్ని  అందించాడు. దీంతో సోషల్ మీడియాలో రింకు సింగ్ పేరు ఒక్కసారిగా వైరల్ అయింది.

ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని రింకు.. కోల్ కత్తా మిడిలార్డర్ లో కీలక ఆడగాడయ్యాడు. ఉత్తర్ ప్రదేశ్ దేశవాళి క్రికెట్ లో తనకంటూ ఓ ముద్ర సంపాదించుకున్న రింకు.. అంత ఈజీగా ఏం పైకి రాలేదు. తన లైఫ్ లో ఎన్నో కీలక మలుపులు ఉన్నాయి. ఎన్నో ఒడి దుడుకులు ఉన్నాయి. 

స్వీపర్ గా పని చేసి:

రింకు సింగ్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఐదుగురు సంతానంలో మూడో వాడైన రింకు.. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యత చేపట్టాడు. గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలో పనిచేసే తన తండ్రికి చేదోడు వాదోడుగా నిలబడేందుకు వాళ్ల గ్రామంలో స్వీపర్ గా పనిచేశాడు.

తన 16 ఏట 2014లో దేశవాళిలో అడుగుపెట్టాడు రింకు. 2017లో 19 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరుపున పాల్గొనే  అవకాశం వచ్చింది. అయితే, ఆ సీజన్ లో ఆడే అవకాశం మాత్రం దక్కించుకోలేదు. 

కోల్ కత్తాతో టర్నింగ్ పాయింట్:

రింకు సింగ్ ను 2018లో రూ.80 లక్షల బేస్ ప్రైజ్ కు కోల్ కత్తా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఆ సీజన్ లో తొలి మ్యాచ్ బెంగుళూరు జట్టుపై అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సీజన్లన్నీ కేకేఆర్ కు ఆడుతున్నా.. ఎక్కువగా అవకాశాలు దక్కలేదు. మోకాలి గాయంతో 2022 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 2023 వేలంలో రూ.55 లక్షల బేస్ ప్రైజ్ కు రింకును కోల్ కత్తా రిటైన్ చేసుకుంది. 

తండ్రికి నచ్చజెప్పి:

చిన్న వయసులో క్రికెటర్ అవుతాన్నంటే రింకు వాళ్ల నాన్న కొట్టేవాడట. కుటుంబానికి సాయంగా ఉండమని మందలించేవాడట. అయితే, 2012లో జరిగిన ఓ స్కూల్ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఓ బైక్ గెలిచాడు రింకు. ఇక అప్పటినుంచి తన ఫ్యామిలోలో తనకు ఎవరూ అడ్డు చెప్పలేదు.

2018-10 రంజీ సీజన్ లో ఉత్తరప్రదేశ్ తరుపున పది ఇన్నింగ్స్ లు ఆడిన రింకు.. నాలుగు సెంచరీలు బాది 953 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 50 లిస్ట్ -ఏ మ్యాచ్ లు, 78 టీ20 మ్యాచ్ లు ఆడిని రింకు సింగ్.. 8 సెంజరీలు, 41  హాఫ్ సెంచరీలు చేసి 6,016 పరుగులు సాధించాడు. అయితే, ఆరేళ్ల నుంచి ఐపీఎల్ ఆడినప్పటికీ కేవలం 20 మ్యాచ్ లు ఆడే అవకాశం వచ్చింది.