ప్రాణాల మీదికొచ్చిన ఫీవర్ సర్వే!

V6 Velugu Posted on May 27, 2021

  • ఫీవర్ సర్వేతో ప్రాణాల మీదికి!
  • వెయ్యి మందికి పైగా హెల్త్, మున్సిపల్, పంచాయతీ సిబ్బందికి కరోనా 
  • వారి నుంచి కుటుంబసభ్యులకూ సోకిన వైరస్ 
  • సరిపడా మాస్కులు, శానిటైజర్లు ఇయ్యని ప్రభుత్వం  
  • 20 రోజులుగా సర్వే చేస్తున్నా ఇన్సెంటివ్స్ ఇయ్యలె 
  • హోం ఐసోలేషన్​లో ఉన్నోళ్లను పట్టించుకోవడం లేదని బాధితుల ఆవేదన

వెలుగు, నెట్​వర్క్: కరోనా అనుమానితులను గుర్తించేందుకు ఈ నెల 5 నుంచి చేపట్టిన ఫీవర్​ సర్వే కారణంగా సుమారు వెయ్యి మందికి పైగా సిబ్బంది వైరస్​ బారిన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్, మున్సిపల్, పంచాయతీ సిబ్బందితో ఏర్పాటు చేసిన టీమ్స్ ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి పల్స్, టెంపరేచర్​చెక్ చేయాలని ఆదేశాలిచ్చిన  ఉన్నతాధికారులు.. వారికి కావాల్సినన్ని ఫేస్​షీల్డ్​లు, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు మాత్రం సప్లై చేయలేదు. దీంతో ప్రతి జిల్లాలోనూ సర్వేలో పాల్గొన్న వందలాది మంది స్టాఫ్​కు, సర్వేను పర్యవేక్షించిన అధికారులకు, వాళ్ల నుంచి కుటుంబసభ్యులకూ కరోనా సోకింది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 150 మంది వైరస్ బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత సీరియస్​గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వెయ్యి మందికి ఒక్క టీమ్.. 
కరోనా లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే అనుమానితులకు టెస్టులు చేయలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం.. పబ్లిక్ నుంచి విమర్శలు రావడం,  హైకోర్టు కూడా మొట్టికాయలు వేయడంతో ప్రత్యామ్నాయంగా ఫీవర్ సర్వే ప్రారంభించింది. ఇందుకోసం ఏ‌ఎన్‌ఎం, అంగన్​వాడీ టీచర్, ఆశా కార్యకర్త, మున్సిపాలిటీ/గ్రామ పంచాయతీ నుంచి ఒకరు చొప్పున నలుగురితో కూడిన టీమ్​లను ఆఫీసర్లు ఏర్పాటు చేశారు. 

పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి టీమ్ కనీసం వెయ్యి మందిని సర్వే చేయాలని టార్గెట్​పెట్టారు. వీరంతా ఇంటింటికీ వెళ్లి కుటుంబంలోని అందరికీ టెంపరేచర్, పల్స్​చెక్​చేయాలని ఆదేశాలిచ్చారు. ఎవరికైనా ఫీవర్​, దగ్గు, జలుబు ఇతరత్రా కరోనా లక్షణాలుంటే.. వారి వివరాలు నమోదు చేయడంతో పాటు మెడిసిన్​కిట్లు కూడా అందజేయాలన్నారు. 

అరకొర మాస్కులు, ఒక్కటే శానిటైజర్.. 
ప్రాణాలకు తెగించి సర్వేకు వెళ్తున్న సిబ్బందికి కావాల్సినన్ని మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను సర్కారు సప్లై చేయలేదు. కచ్చితంగా ఫేస్​షీల్డ్​లు ఇవ్వాల్సి ఉన్నా ఇయ్యలేదు. సర్వే ప్రారంభానికి ఒకరోజు ముందు అరకొర మాస్కులు, టీమ్​కు ఒక్కటే శానిటైజర్ ఇచ్చారు. అవి ఒకట్రెండు రోజుల్లోనే అయిపోయాయి. కొన్ని టీమ్​లకైతే ఆ ఒక్క శానిటైజర్​కూడా ఇవ్వలేదు. అదీగాక ప్రతి టీమ్​కు వెయ్యి మందిని సర్వే చేయాలని టార్గెట్​ పెట్టడంతో తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సిబ్బంది ఉరుకులు పరుగుల మీద సర్వే చేశారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో చేసిన సర్వేలో దాదాపు 2 లక్షల మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించగా, వారికి దగ్గరగా వెళ్లినందుకు  రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి మందికిపైగా స్టాఫ్ కు వైరస్ సోకింది. బాధితుల కుటుంబసభ్యులనూ కలుపుకుంటే ఈ సంఖ్య 4 రెట్లు ఉంటుంది. 

జిల్లాకు 30 నుంచి 100 మంది..   
ప్రతి జిల్లాలోనూ కనీసం 30  నుంచి 100 మందికి పైగా స్టాఫ్​కరోనా బారిన పడినప్పటికీ, ఆఫీసర్లు ఆ వివరాలు చెప్పడం లేదు. పలు జిల్లాల్లో హెల్త్​ఆఫీసర్లు చెప్పిన దాని ప్రకారం.. సూర్యాపేటలో 150 మంది, సిద్దిపేటలో100 మంది, ములుగులో 54 మంది, నిర్మల్ లో 50 మంది, వరంగల్ అర్బన్ లో 47 మంది, పెద్దపల్లిలో 45 మంది, కరీంనగర్ లో 36 మంది, మహబూబాబాద్ లో 34 మంది, కొత్తగూడెంలో 33 మంది, మెదక్ లో 25 మంది కరోనా బారిన పడ్డారు. మున్సిపల్, పంచాయతీ సిబ్బంది వీరికి అదనం. ఈ లెక్కన వెయ్యి మందికి పైగా కొవిడ్​బారిన పడ్డట్లు తెలుస్తోంది. కాగా, సర్వే కారణంగా కొవిడ్ సోకిన సిబ్బందిని హోం ఐసోలేషన్​లో ఉండాలంటూ ఉన్నతాధికారులు చేతులు దులుపుకుంటున్నారు. సీరియస్​ అయితే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ప్రాణాలకు తెగించి ఇంటింటి సర్వే చేస్తే ఇప్పటివరకు ఎలాంటి అలవెన్స్​ఇవ్వలేదని, హోం ఐసోలేషన్​లో ఉన్న వాళ్లకు కనీసం నిత్యావసర సరుకులైనా పంపిణీ చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సర్వేతోనే వచ్చింది..
కరోనా పేషెంట్ల కోసం చేపట్టిన ఇంటింటి సర్వే వల్లే నాకు కరోనా సోకింది. నా వల్ల నా ఇద్దరు పిల్లలకూ పాజిటివ్​ వచ్చింది. కానీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రాణాలకు తెగించి సర్వే చేసిన మాకు ప్రభుత్వం కనీసం అలవెన్స్ కూడా ఇయ్యలేదు. నిత్యావసర సరుకులైనా అందించలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. 
- ఝాన్సీ, ఏఎన్ఎం, తుంగతుర్తి, సూర్యాపేట

ప్రాణాలు పణంగా పెట్టి.. 
20 రోజులుగా ఫీవర్ సర్వే చేస్తున్నాం. నాతో పాటు ఇతర సిబ్బంది కూడా పాజిటివ్​ వచ్చింది. ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నప్పటికీ మాకు అరకొర జీతాలే ఇస్తున్నారు. ఇకనైనా కనీస రక్షణ చర్యలు కల్పించాలి. సరిపడా మాస్కులు, శానిటైజర్లు అందజేయాలి. 
- శోభ, ఏఎన్ఎం, వంగపల్లి, వరంగల్​ అర్బన్​

Tagged coronavirus, masks, sanitizers, corona spread, ANM, fever survey, fronline warriors

Latest Videos

Subscribe Now

More News