న్యూఢిల్లీ: అధిక కెఫిన్ కలిగిన సాఫ్ట్ డ్రింకుల లేబుళ్లపై ‘ఎనర్జీ డ్రింక్’ అనే పదాన్ని వాడకూడదని ఇండియా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆదేశించింది. పెప్సీ, రెడ్ బుల్, మాన్‌స్టర్, రిలయన్స్, హెల్ ఎనర్జీ వంటి ప్రముఖ సంస్థల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 'ఎనర్జీ డ్రింక్స్' పేరుతో ప్రత్యేక ప్రామాణిక కేటగిరీ ఏదీ లేదని, "శరీరానికి, మనస్సుకు శక్తినిస్తుంది" లేదా "నీరసానికి మేలు చేస్తుంది" వంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని రెగ్యులేటర్ స్పష్టం చేసింది.
లేబుళ్లు మార్చడానికి కంపెనీలకు 90 రోజుల గడువు ఇస్తున్నట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజిత్ పున్హానీ తెలిపారు. అసంతృప్తిగా ఉంటే కోర్టును ఆశ్రయించొచ్చని స్పష్టం చేయడంతో కంపెనీలు మార్పులకు అంగీకరించాయి. రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే స్టింగ్, క్యాంపా ఎనర్జీ, రెడ్ బుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. అలాగే ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు డ్రింక్స్‌ను 'ఎనర్జీ డ్రింక్'గా ప్రచారం చేయవద్దని ఆదేశించింది. ఈ రకమైన పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు పరిశ్రమతో ముందస్తు చర్చలు జరపాలని ఇండియా బెవరేజెస్ అసోసియేషన్ పేర్కొంది.
