ట్రక్​ డ్రైవర్ల సమ్మె ఎఫెక్ట్.. పెట్రోల్ బంక్లు జామ్

ట్రక్​ డ్రైవర్ల సమ్మె ఎఫెక్ట్.. పెట్రోల్ బంక్లు జామ్
  • పలుచోట్ల ‘నోస్టాక్’ బోర్డులు.. బంకుల మూత
  • చర్చల తర్వాతే ‘హిట్​ అండ్​ రన్​’ చట్టం అమలు చేస్తామన్న కేంద్రం
  • దేశవ్యాప్తంగా సమ్మె విరమించిన డ్రైవర్లు.. ఎప్పటిలాగే బంక్​లకు పెట్రోల్​, డీజిల్​ సరఫరా

హైదరాబాద్, వెలుగు: కేంద్రం తెచ్చిన ‘హిట్ అండ్ రన్’ చట్టానికి వ్యతిరేకంగా ఆయిల్‌‌ ట్యాంకర్ల ఆపరేటర్లు, డ్రైవర్ల ఆందోళనలతో.. పెట్రోల్‌‌ బంకుల్లోని స్టాక్‌‌పై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని చోట్ల ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడం, ఇంకొన్ని చోట్ల స్టాక్ అయిపోతుందన్న కారణంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. ఎక్కడ చూసినా భారీగా క్యూకట్టారు. దీంతో గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌లో పెట్రోల్‌‌ బంకులున్న ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌‌ అయింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ఎటూ కదలకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

రాష్ట్రానికి పెట్రోల్ సరఫరా కాలే

కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్‌‌ యాక్ట్‌‌లో ఇటీవల కొన్ని సవరణలు తీసుకువచ్చింది. కొత్తగా అమలులోకి వచ్చిన చట్టం ప్రకారం ‘హిట్ అండ్ రన్’ కేసుల్లో దోషులకు గరిష్ఠంగా పదేండ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల జరిమానా విధించనున్నారు. దీనిపై ఆయిల్‌‌ ట్యాంకర్లు, ట్రక్కుల డ్రైవర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల నిరసనలకు పిలుపునిచ్చారు. మంగళవారం స్ట్రైక్ కొనసాగించడంతో.. రాష్ట్రానికి రావాల్సిన పెట్రోల్‌‌ స్టాక్‌‌ బంకులకు సరఫరా కాలేదు. దీంతో హైదరాబాద్‌‌, వరంగల్‌‌ తదితర ప్రాంతాల్లోని పెట్రోల్‌‌ బంక్‌‌ల నిర్వాహకులు పెట్రోల్‌‌, డీజిల్‌‌ స్టాక్ అయిపోయిందంటూ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టారు. దీంతో స్టాక్ ఉన్న చోట పెట్రోల్ పోయించుకునేందుకు బంకుల వద్దకు పోటెత్తారు. మరోవైపు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ముందు జాగ్రత్తలు చేపట్టాయి. దీంతో హైదరాబాద్‌‌లో చాలా వరకు భారత్​ పెట్రోలియం, ఇండియన్ ​ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉండింది. ఆయా బంకుల వద్ద భారీగా రద్దీ కనిపించింది.

ట్రాఫిక్ జామ్.. రోడ్లన్నీ బ్లాక్ 

నిజానికి మంగళవారం ఉదయం నుంచే పలు పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్​ బోర్డులు కనిపించాయి. అయితే చాలా మంది వాహనదారులు తొలుత పెద్దగా పట్టించుకోలేదు. మధ్యాహ్నం తర్వాత చాలా పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోవడం, వందల సంఖ్యలో వాహనదారులు క్యూ కట్టడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీంతో బంకుల నిర్వాహకులు వాహనదారులను అదుపు చేయలేక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. బంకుల నిర్వాహకులే ఉద్దేశపూర్వకంగా పెట్రోల్​అమ్మడం లేదంటూ వాహనదారులు వాగ్వాదానికి దిగారు. రోడ్లను ఆనుకునే బంకులు ఉండడంతో ప్రధాన రహదారుల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్, లక్డీకాపూల్, నాంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, ఇందిరాపార్క్‌‌, బర్కత్‌‌పుర, తిలక్‌‌నగర్‌‌, రామంతాపూర్‌‌, హబ్సిగూడ, ఉప్పల్‌‌ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి.

పెట్రోల్, డీజిల్ సరఫరాలో కొరత లేదు: సివిల్ సప్లయ్స్‌‌ కమిషనర్‌‌

పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని, ప్రజలు భయాందోళనకు గురికావద్దని సివిల్ సప్లయ్స్‌‌ కమిషనర్‌‌ డీఎస్ చౌహాన్ సూచించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా రవాణా కార్యకలాపాలు పునరుద్ధరించినట్లు వెల్లడించారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పారు. డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో సివిల్‌‌ సప్లయ్స్‌‌ భవన్‌‌లో బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్‌‌పీసీఎల్ కంపెనీల అధికారులతో మంగళవారం ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు.

జనం ఆందోళన చెందవద్దు

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలను ఆయిల్ ట్యాంకర్లు, ట్రక్కుల డ్రైవర్లు విరమించారు. పెట్రోల్, డీజిల్​పై జనం ఆందోళన చెందవద్దు. అన్ని పెట్రోల్ బంకులకు సరఫరా ప్రారంభమైంది. హైదరాబాద్‌‌లోని అన్ని పెట్రోల్ బంకులను సరఫరా చేయనున్నాం. అనవసరంగా ఆందోళనకు గురై వాహనదారులు రోడ్లపైకి రావద్దు.
– మర్రి అమరేందర్​రెడ్డి, తెలంగాణ పెట్రోల్, 
డీజిల్ డీలర్ల సంఘం అధ్యక్షుడు 

చట్ట సవరణను పరిశీలించాక నిర్ణయం

కేంద్రం తీసుకొచ్చిన ఎంవీ చట్ట సవరణలకు వ్యతిరేకంగా డ్రైవర్లు ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేశారు. డ్రైవర్లు ఆకస్మికంగా సమ్మెలోకి వెళ్లడంతో గందరగోళం ఏర్పడింది. కేంద్రం చేసిన చట్ట సవరణపై స్పష్టత రావాల్సి ఉంది. వాహనదారులను డ్రైవర్ల అసోసియేషన్ ఇబ్బందులు పెట్టొద్దు. చట్ట సవరణను పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణకు దిగుదాం.
– పెట్రోల్, డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి