
సెంట్రల్ బ్యాంక్‌లు బాగా కొనేస్తున్నాయ్!
ఇండియాలో 13 శాతం పెరిగిన డిమాండ్
పవిత్రమైన రోజులు, ఆకర్షణీయ ధరలే కారణం
వెలుగు, బిజినెస్‌డెస్క్ : ఇండియాలో గోల్డ్ డిమాండ్ బాగా పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో గోల్డ్ డిమాండ్ 13 శాతం పెరిగి 213.2 టన్నులకు చేరుకున్నట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) ప్రకటించింది. ఆకర్షణీయమైన ధరలు, పవిత్రమైన రోజులు ఎక్కువగా ఉండటంతో గోల్డ్‌కు డిమాండ్ పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. 2018 రెండో క్వార్టర్‌లో ఈ డిమాండ్ కేవలం 189.2 టన్నులుగా మాత్రమే ఉండేది. వాల్యు టర్మ్స్‌లో చూస్తే గోల్డ్ డిమాండ్ 17 శాతం పెరిగి రూ.62,422 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ డిమాండ్ రూ.53,260 కోట్లుగా ఉండేది. మొత్తం జుయల్లరీ డిమాండ్ ఈ క్యూ2లో 12 శాతం పెరిగి 168.6 టన్నులకు చేరుకుంది. ఈ జుయల్లరీ డిమాండ్ గతేడాది 149.9 టన్నులుగా ఉండేది. జుయల్లరీ డిమాండ్ కూడా రూ.42,200 కోట్ల నుంచి రూ.49,380 కోట్లకు ఎగిసింది. గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్లు కూడా అలానే పెరిగాయి. గతేడాది గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ రూ.11,060 కోట్లు ఉంటే, ఈ ఏడాది అది 18 శాతం పెరిగి రూ.13,040 కోట్లకు చేరుకున్నట్టు డబ్ల్యూజీసీ వెల్లడించింది. 2019 పూర్తి ఏడాదికి గాను, గోల్డ్ డిమాండ్ 750 టన్నుల నుంచి 850 టన్నులుగా ఉంటుందని మార్కెట్ అంచనావేస్తోంది.
గణనీయమైనట్రేడ్ ప్రమోషన్స్, పవిత్రమైన రోజులు, ధరలు తక్కువగా ఉండటంతో వినియోగదారుల నుంచి పాజిటివ్ స్పందనలు ఇండియాలో గోల్డ్ డిమాండ్‌ను 2019 క్యూ2లో 13 శాతం పెంచాయని డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరమ్ పీఆర్ చెప్పారు. బార్, కాయిన్ డిమాండ్ కూడా ఈ క్యూ2లో ఐదేళ్ల గరిష్టానికి చేరుకున్నట్టు చెప్పారు. మొత్తంగా ఇండియాలో గోల్డ్ డిమాండ్ ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో 9 శాతం పెరిగి 372.2 టన్నులకు చేరుకున్నట్టు చెప్పారు. ఎన్నికల కాలంలో నగదు కొరత, ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ గతేడాది కంటే ఈ ఏడాది గోల్డ్ డిమాండ్ పెరిగిందన్నారు. అక్షయ్ తృతీయ కొనుగోళ్లు, అనుకూలమైన ధరలు గోల్డ్ డిమాండ్‌ను 2019 తొలి ఆరు నెలల కాలంలో పెంచేశాయని సోమసుందరమ్ అన్నారు. అయితే ఇటీవల బడ్జెట్‌లో పెంచిన కస్టమ్ డ్యూటీ పెంపు ప్రభావం గోల్డ్‌పై దీర్ఘకాలం ప్రభావం చూపదని భావిస్తున్నట్టు చెప్పారు.
మూడేళ్ల గరిష్టానికి గ్లోబల్ గోల్డ్ డిమాండ్…
గ్లోబల్‌గా గోల్డ్ డిమాండ్ 2019 తొలి ఆరు నెలల కాలంలో మూడేళ్ల గరిష్టానికి చేరుకుని, 2,181.7 టన్నులుగా నమోదైంది. ఈ క్వార్టర్‌లో కూడా 8 శాతం పెరిగి 1,123 టన్నులుగా ఉంది. సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గోల్డ్ డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణమయ్యాయి. 2019 క్యూ2లో సెంట్రల్ బ్యాంక్‌లు 224.4 టన్నుల బంగారాన్ని కొన్నాయి. ఎక్కువగా ఎమర్జింగ్ మార్కెట్లు ఈ బంగారాన్ని కొన్నట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. గోల్డ్ ఈటీఎఫ్ హోల్డింగ్స్ ఈ క్యూ2లో ఆరేళ్ల గరిష్టానికి చేరుకుని 67.2 టన్నులు పెరిగి 2,548 టన్నులుగా ఉన్నాయి. ఈ క్యూ2లో గోల్డ్ సప్లయ్ 6 శాతం పెరిగి 1,186.7 టన్నులుగా ఉంది.
ఆర్‌బీఐ 17.7
టన్నులు కొన్నది…
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 17.7 టన్నుల గోల్డ్‌ను కొన్నదని సోమసుందరమ్ చెప్పారు. 2018లో ఇది కేవలం 8.1 టన్నులే కొన్నదని తెలిపారు. డిమాండ్ కంటే సప్లయ్ ఎక్కువగా ఉండటంతో, దేశంలోకి వచ్చే షిప్‌మెంట్లు తగ్గిపోయినట్టు సోమసుందరమ్ చెప్పారు. ‘2017 తొలి క్వార్టర్ నుంచి అత్యధిక సప్లయ్ జరిగింది. ముందస్తు జాగ్రత్తగా ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ దిగుమతులను తగ్గించేస్తున్నారు. ఇది డిమాండ్ పై ఏ ప్రభావం చూపదు. గోల్డ్ ధరలు అత్యధికంగా ఉండటంతో, రిసైక్లింగ్ కూడా పెరుగుతూ ఉంటోంది’ అని సోమసుందరమ్ తెలిపారు.