ఐఎస్‌‌బీ హైదరాబాద్‌‌ స్టూడెంట్లకు ఫుల్‌‌ డిమాండ్‌

ఐఎస్‌‌బీ హైదరాబాద్‌‌ స్టూడెంట్లకు ఫుల్‌‌ డిమాండ్‌
  • సగటున రూ. 34 లక్షల జీతం ఇచ్చేందుకు కంపెనీల క్యూ
  • ప్రతీ స్టూడెంటుకు యావరేజ్ గా రెండు కంటే ఎక్కువ ఆఫర్లు
  • భారీగా హైర్ చేసుకుంటున్న కన్సల్టెంట్, ఫైనాన్షియల్ కంపెనీలు

బిజినెస్‌‌ డెస్క్, వెలుగు: ఎంబీఏ స్టూడెంట్లకు రూ. లక్షల్లో జీతాలిచ్చి కంపెనీలు హైర్ చేసుకుంటున్నాయి. తాజాగా క్యాంపస్ ప్లేస్‌‌మెంట్స్‌‌ను పూర్తి చేసిన ఇండియన్  స్కూల్ ఆఫ్ బిజినెస్‌‌ (ఐఎస్‌‌బీ), తమ స్టూడెంట్లకు  సగటున రూ. 34.07 లక్షలు శాలరీ (ఏడాదికి) ప్యాకేజ్‌ ఇవ్వడానికి కంపెనీలు క్యూ కట్టాయని పేర్కొంది.  కిందటేడాది సగటున రూ. 28.21 లక్షలు శాలరీ ప్యాకేజి ఆఫర్లను అందుకోగా, ఈ సారి ఈ నెంబర్ 20.78 శాతం పెరిగిందని తెలిపింది. కన్సల్టింగ్ కంపెనీలు ఎంబీఏ స్టూడెంట్లను ఎక్కువగా హైర్‌‌‌‌ చేసుకుంటున్నాయని తెలిపింది. కాగా,  ఐఎస్‌‌బీకి హైదరాబాద్‌‌, మొహాలిలో  క్యాంపస్‌‌లు ఉన్నాయి. ఈ సారి మొత్తం 929 స్టూడెంట్లకు ప్లేస్‌‌మెంట్‌‌లు దక్కగా, క్యాంపస్‌‌ ఇంటర్వ్యూల్లో  270 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ కంపెనీలు ఏకంగా 2,066 జాబ్‌‌ ఆఫర్లను చేశాయని ఐఎస్‌‌బీ ప్రకటించింది. అంటే ప్రతీ స్టూడెంట్‌‌కు యావరేజ్‌‌గా రెండు కంటే ఎక్కువ జాబ్ ఆఫర్స్‌‌ వచ్చాయని తెలిపింది. గత ఏడాది కాలం నుంచి క్యాంపస్ ప్లేస్‌‌మెంట్స్‌‌ బాగా పెరుగుతున్నాయి.  ఐఐటీ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఇంజినీరింగ్ స్టూడెంట్లను కంపెనీలు భారీగా హైర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎంబీఏ స్టూడెంట్లకూ పెద్ద మొత్తం శాలరీలు  ఇచ్చేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. 

మహిళలకు జాబ్‌‌ ఆఫర్లు పెరిగాయ్‌‌..
ఐఎస్‌‌బీ క్యాంపస్‌‌లలో  క్లాస్‌‌లో  మహిళా స్టూడెంట్ల వాటా 39 శాతంగా ఉంది.  దేశంలోని ఇతర బిజినెస్‌‌ స్కూళ్లలో కంటే తమ వద్దే  ఎక్కువ మంది మహిళా స్టూడెంట్లు ఉన్నారని ఐఎస్‌‌బీ చెబుతోంది. ఈ సారి క్యాంపస్ ప్లేస్‌‌మెంట్‌‌లలో 41 శాతం మంది మహిళా స్టూడెంట్లకు ఆఫర్లు దక్కాయని  పేర్కొంది. స్కిల్‌‌ ఉన్న వారిని నియమించుకోవడానికి కంపెనీలు ఐఎస్‌‌బీ బాట పడుతున్నాయని  ఈ సంస్థ  డిప్యూటీ డీన్  రామభద్రన్ తిరుమలై అన్నారు. 

కన్సల్టింగ్ కంపెనీల వాటానే ఎక్కువ..
 కన్సల్టింగ్ కంపెనీలు ఎంబీఏ స్టూడెంట్లను ఎక్కువగా హైర్ చేసుకుంటున్నాయి. ఐఎస్‌‌బీ స్టూడెంట్లను రిక్రూట్ చేసుకున్న కంపెనీల్లో కన్సల్టింగ్ కంపెనీల వాటా 37 శాతంగా ఉంది. మెకెన్సీ అండ్ కో, బైన్‌‌ అండ్ కో, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌‌, డెలాయిట్‌‌ ఇండియా, యాక్సెంచర్‌‌‌‌ సొల్యూషన్స్‌‌, కెర్నీ, ప్రైస్‌‌వాటర్‌‌‌‌హౌస్‌‌కూపర్స్‌‌, ఎల్‌‌ఈకే కన్సల్టింగ్‌‌, ఆర్థర్‌‌‌‌ డీ. లిటిల్‌‌, ఈవై పార్తనన్‌‌ స్ట్రాటజీ మెనా వంటి కంపెనీలు స్టూడెంట్లకు మంచి జాబ్‌‌ ఆఫర్లు చేశాయి.

హైరింగ్‌‌లో బ్యాంక్‌‌లు ..
ఐఎస్‌‌బీ స్టూడెంట్లకు వివిధ ఫైనాన్షియల్ కంపెనీలు కూడా మంచి  శాలరీ ప్యాకేజిని ఆఫర్ చేశాయి. యాక్సిస్ బ్యాంక్‌‌, క్రెడిట్‌‌ సూస్‌‌, ఫస్ట్ రాండ్ బ్యాంక్‌‌, బేర్‌‌‌‌క్లేస్‌‌, గోల్డ్‌‌మాన్‌‌ శాచ్స్‌‌, వెల్స్‌‌ ఫార్గో, కోటక్‌‌ మహీంద్రా క్యాపిటల్‌‌, మెరిసిస్ అడ్వైజర్స్‌‌ వంటి కంపెనీలు ఐఎస్‌‌బీ స్టూడెంట్లకు మంచి ప్యాకేజిని ఆఫర్ చేశాయి. ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు, వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఐఎస్‌‌బీ స్టూడెంట్ల వెంట పడ్డాయి. ఈ సారి వచ్చిన జాబ్ ఆఫర్లలలో  9.8% వాటా ఫైనాన్షియల్‌ సెక్టార్‌‌‌‌దే ఉందని ఐఎస్‌‌బీ ప్రకటించింది.  ఆదిత్య బిర్లా గ్రూప్‌‌, రిలయన్స్,  జేఎస్‌‌డబ్ల్యూ గ్రూప్‌‌, అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌ వంటి కంపెనీలు కూడా ఐఎస్‌‌బీ గ్రాడ్యుయేట్లను హైర్ చేసుకున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌, ఉబర్‌‌‌‌, సిస్కో వంటి ఐటీ, ఐటీ రిలేటెడ్‌‌ సెక్టార్‌‌‌‌ కంపెనీలు కూడా ఐఎస్‌‌బీ స్టూడెంట్లకు మంచి శాలరీ ప్యాకేజిని ఆఫర్ చేశాయి.

ఐఐఎంలలోనూ హైరింగ్‌‌ సూపర్‌‌‌‌..
ఐఐఎం అహ్మదాబాద్‌‌, బెంగళూరు, కలకత్తా వంటి పాపులర్ మేనేజ్‌‌మెంట్ ఇన్‌‌స్టిట్యూషన్‌‌లలో  క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. వీటిలో క్యాంపస్ ప్లేస్‌‌మెంట్స్‌‌  ఈ నెల చివరిలో స్టార్టయి వచ్చే నెల  స్టార్టింగ్ వరకు కొనసాగుతుందని అంచనా. ఈ ఇన్‌‌స్టిట్యూట్ల స్టూడెంట్లకు భారీ శాలరీ ప్యాకేజిలిచ్చి కంపెనీలు హైర్ చేసుకునే అవకాశం ఉంది. కాగా, ఐఐఎం ఇండోర్‌‌‌‌, ఐఐఎం నాగ్‌‌పూర్‌‌‌‌లు తమ 2022 గ్రాడ్యుయేట్ స్టూడెంట్ల కోసం క్యాంపస్ ప్లేస్‌‌మెంట్స్‌‌ను ఇప్పటికే పూర్తి చేశాయి.  ఐఐఎం ఇండోర్‌‌కి చెందిన మొత్తం 572 మంది స్టూడెంట్లు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఆఫర్లు పొందగా, వీరికి ఏడాదికి సగటున రూ. 25.01 లక్షలు ఇవ్వడానికి కంపెనీలు ముందుకొచ్చాయి.  ఐఐఎంలలో  పోస్ట్‌‌ గ్రాడ్యుయేట్‌‌ ప్రోగ్రామ్‌‌ (హ్యూమన్ రిసోర్స్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌) స్టూడెంట్లకు కూడా యావరేజ్‌‌గా రూ. 20.4 లక్షలు ఇచ్చి తీసుకునేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. భారతీయ విద్యా భవన్‌‌కు చెందిన ఎస్‌‌పీ జైన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌‌మెంట్‌‌ అండ్ రీసెర్చ్‌‌ స్టూడెంట్లకు ప్లేస్‌‌మెంట్‌‌లో ఏడాదికి సగటున రూ. 32.05 లక్షలు ఇచ్చేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. ‌‌