మహబూబ్​నగర్ ఎంపీ టికెట్​కు ఫుల్​ గిరాకీ

మహబూబ్​నగర్ ఎంపీ టికెట్​కు ఫుల్​ గిరాకీ
  •     కాంగ్రెస్​   టికెట్​ కోసం  ఏడుగురి అప్లికేషన్​
  •     ఆశావహుల్లో సీనియర్లు, బీసీ లీడర్లు
  •     బీజేపీలో టికెట్​ కోసం లీడర్ల మధ్య ఇంటర్నల్​ వార్​

మహబూబ్​నగర్​, వెలుగు : పాలమూరు  ఎంపీ టికెట్ కోసం హైకమాండ్​ దగ్గరకు  ఆయా పార్టీల లీడర్లు క్యూ కడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్​ నుంచి  బరిలో నిలిచేందుకు ఆశావాహులు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఇందులో సీనియర్​ లీడర్లతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్​ ఆశించి భంగపడ్డ లీడర్లు,   ఆశావహులు ఉన్నారు.

కాంగ్రెస్​లో పోటాపోటీ..

పార్లమెంట్​ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి నుంచి కాంగ్రెస్​ పార్టీ  అప్లికేషన్లు  తీసుకుంటోంది. శనివారం చివరి రోజు కావడంతో హైదరాబాద్​కు లీడర్లు క్యూ కట్టారు. ఇప్పటి వరకు ఏడుగురు టికెట్ల కోసం అప్లై చేసుకున్నట్లు  తెలిసింది. అప్లై చేసుకున్న వారిలో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​ రెడ్డితో పాటు ఎంఎస్​ఎన్​ ఫార్మా కంపెనీలకు చెందిన డైరెక్టర్​ మన్నె జీవన్​ రెడి, బీసీ లీడర్లు ఎన్​పీ వెంకటేశ్​, సంజీవ్​ ముదిరాజ్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్​ రెడ్డి, వనపర్తి జిల్లాకు చెందిన మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి తనయుడు డాక్టర్​ జిల్లెల ఆదిత్యా రెడ్డి,  యూత్​ కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి​  ఉన్నారు.

అయితే, ఇందులో వంశీచంద్​ రెడ్డి కొంత కాలంగా టికెట్​ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పార్లమెంట్​ పరిధిలోని అన్ని అసెంబ్లీల ఎమ్మెల్యేలతో కలిసి కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఐదు రోజుల కిందట 'పాలమూరు న్యాయ్​ యాత్ర' పేరుతో నారాయణపేట జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించారు. బీసీ లీడర్ అయిన ఎన్​పీ వెంకటేశ్ కూడా టికెట్​ కోసం అప్లై చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు అసెంబ్లీ టికెట్​ను ఆశించిన ఈయన, టికెట్​ రాకపోయినా ఎమ్మెల్యే వైఎస్​ఆర్​ గెలుపు కోసం కృషి చేశారు.

బీసీ ఈక్వెషన్స్​కు తెరమీదకు వస్తే ఆయనకు టికెట్​ వస్తుందనే ఆశతో ఉన్నారు. సిట్టింగ్​ ఎంపీ మన్నె శ్రీనివాస్​ రెడ్డి అన్న కొడుకు మన్నె జీవన్​ రెడ్డి రాజకీయ అరంగెట్రం చేయాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్​ఎస్​ పార్టీ నుంచి జడ్చర్ల, మహబూబ్​నగర్​ అసెంబ్లీల నుంచి పోటీ చేయాలనే ప్రయత్నాలు చేసినా, గత ప్రభుత్వంలోని లీడర్లు అడ్డు పడ్డారు. దీంతో ఆయన ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డితో కలిసి ఢిల్లీ పెద్దలను కలిశారు. త్వరలో కాంగ్రెస్​లో జాయిన్​ అయ్యేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఎంపీ టికెట్​ కోసం అప్లికేషన్​ పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన పరోక్షంగా కొందరు ఎమ్మెల్యేలకు సహకారం అందించి, వారి గెలుపుకు కృషి చేశారు. దీంతో అందరి సహకారంతో తనకు టికెట్​ వస్తుందనే ఆశతో ఉన్నారు. మరో బీసీ లీడర్​ సంజీవ్​ ముదిరాజ్​ కూడా టికెట్​ కోసం అప్లై చేసుకున్నారు.   గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్​ అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతమ్మ టికెట్​ కోసం అప్లికేషన్​ పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆమెకు తగిన గుర్తింపు ఇస్తామనే హామీని హైకమాండ్​ ఇవ్వడంతో ఎంపీ టికెట్​ కోసం అప్లై చేసుకున్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి తన కొడుకు ఆదిత్యా రెడ్డిని పొలిటికల్​ ఎంట్రీ చేయించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందుకు పార్లమెంట్​ ఎలక్షన్స్​ను వేదికగా ఎంచుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నారెడ్డికి హైకమాండ్​ వనపర్తి అసెంబ్లీ టికెట్​ను ఇచ్చినట్లే ఇచ్చి.. చివరి నిమిషంలో  మేఘారెడ్డి అవకాశం కల్పించింది. ఆ సమయంలో చిన్నారెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​ జానారెడ్డి రంగంలోకి దిగి.. సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు చిన్నారెడ్డి ఆయన కొడుకుకు ఎంపీ టికెట్ కోసం అప్లికేషన్​ పెట్టించినట్లు తెలిసింది. యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు శివసేనా రెడ్డి కూడా వనపర్తి అసెంబ్లీ టికెట్​ కోసం ఆశించి భంగపడ్డాడు. ఇప్పుడు ఎంపీ టికెట్​ కోసం అప్లికేషన్​ పెట్టుకున్నాడు. 

బీజేపీలో టికెట్​ కోసం తీవ్రమైన పోటీ

బీజేపీలో పాలమూరు ఎంపీ టికెట్​ కోసం ఫుల్​ పోటీ నడస్తోంది. 'పోటీలో నేను ఉంటున్నానంటే.. నేనూ ఉంటున్నాన్నంటు' ఆ పార్టీ లీడర్ల మధ్యే పంచాదినడుస్తోంది. ఉద్దండులు టికెట్ల కోసం పోటీ పడుతుండటంతో కేడర్​ కూడా కన్​ఫ్యూజ్​లో పడింది. మాజీ ఎంపీ ఏపీ జితేందర్​ రెడ్డి పాలమూరు ఎంపీ టికెట్​ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరూ ఏం చేసినా ఫైనల్​గా టికెట్​ తనకే వస్తుందనే ధీమాలో ఉన్నారు. చివరి నిమిషం వరకు టికెట్​ కోసం ప్రయత్నిస్తానని ఇటీవల ప్రకటన కూడా చేశారు. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా టికెట్​పై గంపెడాశలు పెట్టుకున్నారు.

టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. పార్టీ నుంచి పాలమూరు ఎంపీ బరిలో ఉండేది తానేనంటూ సంకేతాలిస్తున్నారు. అలాగే పార్టీ రాష్ర్ట కోశాధికారి శాంతికుమార్​ కూడా టికెట్​పై ఆశలు పెట్టుకున్నారు. గత మూడు టర్మ్​లలో జరిగిన ఎంపీ ఎలక్షన్స్​లలో ఈయనకు పాలమూరు టికెట్​ కేటాయిస్తారనే చర్చ జరిగినా చివరి నిమిషాల్లో క్యాన్సిల్​ చేశారు. ఈయన పార్టీలో చేరిన నాటి నుంచి హైకమాండ్​ ప్రియారిటీ ఇవ్వలేదు. అయితే ఈ ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్​ వస్తుందని, ఈ పార్లమెంట్​లో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో పోటీ చేసే చాన్స్​ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

జనరల్​ సీట్​ కావడంతో డిమాండ్​

ఉమ్మడి జిల్లాలో మహబూబ్​నగర్​తో పాటు నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ స్థానాలున్నాయి. ఇందులో నాగర్​కర్నూల్​ ఎస్సీకి రిజర్వ్​ కాగా, మహబూబ్​నగర్​ జనరల్​కు సీటు రిజర్వ్​ అయ్యింది. దీంతో ఈ స్థానానికి డిమాండ్​ బాగా పెరిగింది. గత ఎన్నికల్లో టికెట్లు రాని ఆశావహులు, ఏండ్లుగా పార్టీనే నమ్ముకొని పని చేస్తున్న సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.