అంకాపూర్ మక్కబుట్టలకు మస్త్​ గిరాకి

అంకాపూర్ మక్కబుట్టలకు మస్త్​ గిరాకి

ఆ స్పెషాలిటీ ఆ ఊరిని అందరికీ  కొత్తగా పరిచయం చేస్తుంది. ఇతర ప్రాంతాలకీ ఆ ఊరి పేరుని గట్టిగా వినిపిస్తుంది. అచ్చు అంకాపూర్​ మక్కబుట్టల్లానే. మొక్కజొన్న సాగు చాలా ప్రాంతాల్లో చూస్తుంటాం. కానీ, అన్ని గ్రామాల్లో కంటే అంకాపూర్​ మక్కబుట్టలు మరింత స్పెషల్​. వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారు ఇక్కడ. అలాగే రాష్ట్రం మొత్తంలో ఏకైక  మక్కబుట్టల సంత ఉంది అంకాపూర్​లోనే. యాభై యేళ్ల నుంచి ఈ సంత నడుస్తోంది. ఆ ప్రత్యేకతే ఈ ఊరిని దేశమంతా ఫేమస్​ చేసింది. 

జూలై మొదటివారం నుంచి అక్టోబర్​ మూడో వారం వరకు నిజామాబాద్​ జిల్లా అంకాపూర్​లో మక్కబుట్టల సంత నడుస్తుంది.  ఒక్క అంకాపూర్ నుంచే కాకుండా చుట్టుపక్కల 30   గ్రామాల నుంచి మొక్కజొన్న పంట ఈ మార్కెట్​కి వస్తుంది.  ఉదయం ఐదింటి నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు హోల్‌‌సేల్‌‌ అమ్మకాలు జరుగుతాయి ఇక్కడ. స్థానిక వ్యాపారులు కుప్పలుగా పోసి డజన్ల లెక్కన మక్కలు అమ్ముతారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి మరీ  కంకులు కొనుక్కెళ్తారు కొందరు. మక్క బుట్టలకు అంకాపూర్‌‌ అంతలా గుర్తింపు పొందడానికి అక్కడ 50 ఏండ్ల కిందట కట్టిన మార్కెట్​ కూడా ఒక కారణమే. 1970లో జాతీయ రహదారి పక్కన అంకాపూర్ గ్రామస్తులంతా కలిసి సొంతంగా ఈ మక్కబుట్టల మార్కెట్​ని​ ఏర్పాటు చేసుకున్నారు. 

వేల ఎకరాల్లో.. 

అంకాపూర్​లో దాదాపు పదివేల ఎకరాల మొక్కజొన్న సాగు చేశారు ఈ ఏడాది.  మొత్తం సాగుకి 5.5 లక్షల క్వింటాళ్ల  దిగుబడి  రాగా క్వింటాల్​కు నాలుగు నుంచి అయిదువేల రూపాయల ధర పలుకుతోంది. దాంతో22 కోట్ల రూపాయల మక్కల వ్యాపారం జరుగుతుందని అంచనా. కరోనాకి ముందు సుమారు యాభై కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది. కానీ, ఇప్పుడు కాస్త తగ్గిందంటున్నారు రైతులు. 

దేశమంతా ఎగుమతి

రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్ర , మధ్యప్రదేశ్​ , కర్నాటక, ఆంధ్రప్రదేశ్,​ గుజరాత్​ రాష్ట్రాలకు అంకాపూర్​ మక్కబుట్టలు ఎగుమతి అవుతాయి.  వ్యాపారులు లారీలు, వ్యాన్లలో  మక్కలు తీసుకెళ్లి హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, గోదావరిఖని, కోరుట్ల, మెట్​పల్లి, నిజామాబాద్, మహారాష్ట్ర, నాగ్ పూర్, చంద్రపూర్, నాందేడ్, బోపాల్​, అహ్మద్​నగర్​, బెంగళూరు, కర్నూలు, విజయవాడ, వైజాగ్​  ప్రాంతాల్లో అమ్ముతారు. ఈ మక్కలు టేస్టీగా ఉండటంతో పాటు పొడవుగా ఉండటం వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడుతోంది.

మక్కలతో లాభాలు​

ఇతర పంటలతో పోలిస్తే మక్కబుట్ట సాగుకి బాగా లాభాలు వస్తున్నయ్​. అందుకే ప్రతి ఏటా మక్క సాగే  చేస్తున్నా. ఎకరానికి 45 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రేటు బాగుండటంతో ఎకరానికి 65 వేల  రూపాయల ఆదాయం వస్తోంది.  ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు కూడా  మా దగ్గరే మక్కలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒకప్పటితో పోలిస్తే  ఈఏడాది సాగు విస్తీర్ణం కాస్త తగ్గింది.  

- నూతి శ్రీనివాస్​రెడ్డి, రైతు
::: పులగం దేవిదాస్​, నిజామాబాద్, వెలుగు