గుడ్ న్యూస్... ఇన్సూరెన్స్‌‌ పాలసీలపై జీఎస్‌‌టీ లేనట్టే!

గుడ్ న్యూస్... ఇన్సూరెన్స్‌‌ పాలసీలపై జీఎస్‌‌టీ లేనట్టే!

న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్‌‌టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ ప్రీమియాలపై 18శాతం జీఎస్‌‌టీ  పడుతోంది.  13 మంది రాష్ట్ర మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌‌– జీఓఎం)  ఇన్సూరెన్స్‌‌ అంశంపై బుధవారం చర్చించారు.  తెలంగాణ ఉపముఖ్యమంత్రి మళ్ళు భట్టి విక్రమార్క ప్రకారం, చాలా రాష్ట్రాలు మినహాయింపునకు అనుకూలంగా ఉన్నా, ఈ ప్రయోజనం నేరుగా పాలసీదారులకు చేరాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.  ఇన్సూరెన్స్‌‌ పాలసీలపై జీఎస్‌‌టీ తొలగిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు  ఏడాదికి రూ.9,700 కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా.

ప్రభుత్వాలకు రూ.85 వేల కోట్లు లాస్‌‌..

ఎస్‌‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్  ప్రకారం,  జీఎస్‌‌టీ స్లాబ్‌‌ రేట్లు తగ్గిస్తే   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరానికి రూ.85 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతాయి. జీఎస్‌‌టీ సంస్కరణలు  ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమలైతే, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.45 వేల కోట్ల నష్టం వస్తుందని అంచనా. కాగా, వచ్చే నెలలో జరిగే జీఎస్‌‌టీ  కౌన్సిల్ సమావేశంలో జీఓఎం ఆమోదించిన ప్రతిపాదనలు చర్చకు వస్తాయి. తాజా మార్పులతో సగటు జీఎస్‌‌టీ రేటు 9.5 శాతానికి తగ్గే అవకాశం ఉంది.