జపాన్‌ కొత్త ప్రధానమంత్రిగా ఫుమియో కిషిడా

జపాన్‌ కొత్త ప్రధానమంత్రిగా ఫుమియో కిషిడా

మాజీ విదేశాంగ మంత్రి ఫుమియో కిషిడా జ‌పాన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీక‌రించనున్నారు. 64 ఏళ్ల  ఫుమియో కిషిడా ఆ దేశ అధికార పార్టీ నేత‌గా ఎన్నిక‌య్యారు. ప్రస్తుత ప్రధాని యోషిడే సుగా స్థానంలో ఫుమియో బాధ్యతలను చేపట్టనున్నారు. ప్రముఖ టీకా చీఫ్ టారో కోనోను ఓడించి తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు ఫుమియో. అధికారిక పార్టీ ఓటింగ్‌లో కిషిడాకు 257 ఓట్లురాగా, కోనోకు 170 ఓట్లు పోల్‌ అయ్యాయి. 

గత 20 ఏళ్లుగా జపాన్ రాజకీయాలపై ఆధిపత్యం చలాయిస్తున్న నయా-ఉదారవాద ఆర్థిక విధానాలనుంచి వైదొలగాలని, దేశంలో ఆదాయ అసమానతలను అధిగమిస్తామని ఆయన వాగ్దానం చేశారు.  అంతేకాదు కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీని కూడా కిషిడా హామీ ఇచ్చారు.

కిషిడా హిరోషిమా రాజకీయ నాయకుల కుటుంబానికి చెందిన మృదు భాషి. బేస్ బాల్‌ అంటే ఇష్టం.  గతంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పాలసీ చీఫ్‌గా పనిచేశారు. అలాగే 2012-17 మధ్య కాలంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు, ఈ సమయంలో రష్యా ,దక్షిణ కొరియాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతేకాదు అణ్వాయుధాలను రద్దు చేయడమే తన జీవితాశయమని ప్రకటించారు.  కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో పడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోవడం, దేశాన్ని న‌డిపించ‌లేక‌పోతున్నట్టు ఇటీవ‌ల ప్రస్తుత ప్రధాని సుగా ప్రకటించిన క్రమంలో కొత్త ప్రధాని ఎన్నిక తప్పని సరైంది.