ఫండింగ్ బిల్లులు పాస్ కాలే.. మళ్లీ విఫలమైన ట్రంప్ సర్కారు.. సుదీర్ఘ షట్డౌన్ తప్పదా..?

ఫండింగ్  బిల్లులు పాస్ కాలే.. మళ్లీ విఫలమైన ట్రంప్ సర్కారు..  సుదీర్ఘ  షట్డౌన్  తప్పదా..?

వాషింగ్టన్: అమెరికాలో ప్రభుత్వ షట్​డౌన్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇటీవల ప్రభుత్వ నిధుల విడుదలకు సంబంధించి ట్రంప్ సర్కారు ప్రవేశ పెట్టిన రెండు కీలక ఆర్థిక బిల్లులు సెనేట్ లో పాస్ కాలేదు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులకు సంబంధించి తమ డిమాండ్లను ఈ బిల్లులు ప్రతిబింబించడంలేదని డెమోక్రాటిక్ నేతలు వీటిని అడ్డుకున్నారు. 

సెనేట్ లో జరిగిన ఓటింగ్ లో అధికార పార్టీ ప్రవేశపెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా ఓటేశారు. రెండు కీలక బిల్లులు పాస్ కాకపోవడంతో జీతాలు చెల్లించలేక ఫెడరల్ ఉద్యోగులను ట్రంప్ సర్కారు అన్ పెయిడ్ లీవ్ లో పంపించింది. అత్యవసర సేవల ఉద్యోగులు మాత్రం జీతాల్లేకుండానే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. 

ఈ క్రమంలోనే ఫండింగ్ బిల్లులను అధికార రిపబ్లికన్ సభ్యులు శుక్రవారం (అక్టోబర్ 05) మరోమారు ఓటింగ్ కు తీసుకురాగా.. ఈసారి కూడా బిల్లులకు మద్దతు దక్కలేదు. సెనేట్ లో జరిగిన  ఓటింగ్ లో బిల్లులు పాస్ కావాలంటే 60 మంది సభ్యులు ఓటేసి మద్దతు పలకాల్సి ఉండగా.. కేవలం 44 ఓట్లు మాత్రమే అనుకూలంగా పడ్డాయి. 54 మంది సెనేటర్లు ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో అమెరికాలో సుదీర్ఘ షట్ డౌన్ తప్పకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారంలో మరోమారు ఫండింగ్ బిల్లులపై ఓటింగ్ జరిపే అవకాశం లేదని సెనేట్ వర్గాలు తెలిపాయి.