
- 8 ఏండ్లలో ముప్పై శాతం కంటే ఎక్కువ పెరిగిన జనాభా
- ఈ నిధులతో డెవలప్ మెంట్ ,మెయింటనెన్స్, జీతాలిచ్చేదెట్లా ?
- తమ వల్ల కాదంటున్నసర్పంచ్ లు
- గ్రామ పంచాయతీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం ఫండ్స్
రాష్ట్రంలో పంచాయతీలను ఎట్లా నడపాలో తెలీక సర్పంచ్లు సతమతమవుతున్నరు. గ్రామాభివృద్ధి, మెయింటనెన్స్, పారిశుధ్య పనులు, ట్రాక్టర్లు, ట్రాలీ లు, వాటర్ ట్యాంకర్ల కొనుగోలు, కార్మికుల జీతాలు…ఇలా అన్నీ చేయాలని చెబుతున్నారు కానీ ఫండ్స్ఇవ్వడం లేదు. 2011 జనాభా ఆధారంగా నిధులి స్తుండడంతో ఇప్పటి అవసరాలకు అవి ఏమాత్రం సరిపోవట్లేదు. 8 ఏళ్లలో ఒక్కో గ్రామంలో 30% కంటే ఎక్కువ జనాభా పెరగగా ఖర్చులు అంతే స్థాయిలో పెరిగాయి. ట్రాక్టర్లు కొనుగోలు చేశాక ఇన్స్టాల్మెంట్కు ఈజీఎస్ డబ్బులు వాడుకోవాలని సర్కారు జీవో జారీ చేసినా అది ఉపయోగపడేలా లేదు.
హైదరాబాద్ , వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు రూ.339 కోట్లను విడుదల చేస్తోంది. వీటిలో కేంద్ర ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఉన్నాయి. మొత్తం 12,751 పంచాయతీలు ఉండగా, 2011 జనాభా లెక్కల ఆధారంగా జిల్లా అధికారులు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో చాలా గ్రామాలకు పాపులేషన్ ఆధారంగా రూ.20 వేల లోపు నుంచి 6 లక్షల వరకు వస్తున్నాయి. అయితే ఈ ఫండ్స్సరిపోవడం లేదని సర్పంచ్ లు వాపోతున్నారు. కేవలం హౌస్ ట్యాక్స్ తప్పా ఏ ఇతర ఇన్కం సోర్స్ లేదంటున్నారు. ఇప్పటివరకు గ్రామాభివృద్ధికే ఫండ్స్ ఖర్చు చేస్తుండగా రెండు నెలల నుంచి పంచాయతీ కార్మికుల జీతాలు, ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్లు కొనడం లాంటివి ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు మహబూబ్నగర్ జిల్లాలోని ఓ గ్రామ జనాభా 3800 కాగా ప్రభుత్వం నెలకు రూ.2,80,000 వరకూ ఇస్తోంది. ఇప్పటివరకు సెప్టెంబర్, అక్టోబర్ ఫండ్స్ రిలీజ్ అయ్యాయి. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన పైసలు ఇవ్వలేదు. ఖర్చులు, కార్మికుల జీతాలు, ట్రాక్టర్ మెయింటనెన్స్, పైప్లైన్స్డ్యామేజీ, కరెంట్ బిల్లులు , లైట్ల మరమ్మతులు పోను అదనపు ఖర్చు రూ.లక్ష వరకూ అవుతోంది.
ఈజీఎస్ నిధులు వాడుకున్నా కష్టాలే…
సర్కారు ట్రాక్టర్ తో పాటు మొక్కలకు నీళ్లు పోసేందుకు వాటర్ ట్యాంకర్, ట్రాలీ కొనాలని ఆదేశాలు జారీ చేసింది. ఏ కంపెనీ ట్రాక్టర్ తీసుకోవాలన్నా కనీసం రూ.5లక్షలకు పైనే ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్ల కొనుగోలు పక్రియ మెల్లగా సాగుతోంది. మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటి వరకు 3వేల గ్రామాల్లో కూడా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. కొన్ని గ్రామాల్లో పూర్తి డబ్బులు ముందుగానే కట్టి కొంటుండగా, మరికొందరు కొంత అడ్వాన్స్ కట్టి ట్రాక్టర్లు తీసుకుంటున్నారు. కిస్తీలకు ఈజీఎస్ డబ్బులు వాడుకోవచ్చని చెప్పినా కష్టాలు తీరేలా లేవు. ఇన్స్టాల్మెంట్ కట్టినా ట్రాక్టర్ మెయింటనెన్స్కూ ఖర్చు అవుతుందంటున్నారు. అయినా చిన్న గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్అవసరమే ఉండదంటున్నారు. ప్రభుత్వం కొనాలని బలవంత పెడుతోందని సర్పంచ్లు వాపోతున్నారు.
ఊర్లను తాకట్టు పెట్టాల్సిందే
తక్కువ ఫండ్స్ఇస్తూ కార్మికులకు జీతాలు ఇవ్వాలని, ట్రాక్టర్లు, ట్యాంకర్లు కొనాలని, ఇతర పను లు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. 500 జనాభా దాటిన కాలనీలు, తండాలను పంచాయ తీలుగా చేశారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఎస్సీ కాలనీలను జనాభా తక్కువున్న పంచాయతీలుగా చేసుకున్నారు. కొత్త పంచాయతీలకు ఆదాయం లేనప్పుడు జీతాలు, డెవలప్మెంట్, నిర్వహణ ఎలా సాధ్యమైతది. దీనిపై ప్రభుత్వం ఆలోచన చేయాలె.
‑ ప్రణీల్ చందర్, రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ప్రధాన కార్యదర్శి