నిధుల లెక్క పక్కాగా ఉండాలి

నిధుల లెక్క పక్కాగా ఉండాలి
  • కేంద్ర స్కీంల నిధులు మళ్లించడానికి వీల్లేదు
  • నిధుల లెక్క పక్కాగా ఉండాలి
  • కేంద్రంతో పాటు రాష్ట్రమూ వాటా ఇవ్వాలి
  • 40 రోజుల గడువు దాటకూడదు
  • ప్రతినెలా స్కీం అమలు, నిధులపై రివ్యూ చేయాలి
  • కేంద్ర పథకాలు అర్హులందరికీ అందేలా చూసే బాధ్యత రాష్ట్రాలదే
  • కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్, వెలుగు : సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను ఇతర అకౌంట్లకు మళ్లించడానికి వీల్లేదని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. కేంద్ర పథకాలు, నిధులు దేశంలో అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా రాష్ట్రాలు చూడాలని మరోసారి స్పష్టం చేసింది. ఏ స్కీం నిధులు  ఆ స్కీం కోసమే ఖర్చు చేయాలని, కేంద్రంతో పాటు రాష్ట్ర సర్కారు కూడా వాటా ఇవ్వాల్సిందేనని ఆర్థిక శాఖ పేర్కొంది. లేదంటే నిధులు ఆపేస్తమని హెచ్చరించింది. 

కేంద్రం నిధులు విడుదల చేసిన తర్వాత 40 రోజుల్లోపు రాష్ట్ర ప్రభుత్వం విధిగా తన వాటాను విడుదల చేయాలని పేర్కొంది. కేంద్ర వ్యయ విభాగం రూపొందించిన మార్గదర్శకాల అమలుపై రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈ విషయంపై చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు రాష్ట్రాల్లో దారి మళ్ళకుండా పకడ్బందీ విధానాన్ని తీసుకొచ్చారు. పేదల సంక్షేమం కోసం ప్రజాధనాన్ని గ్రామ స్థాయి వరకు పంపుతున్నా.. రాష్ట్రాల్లో కొన్ని చోట్ల దుర్వినియోగమవుతున్నట్లు గుర్తించారు. కేంద్రం పంపే నిధులను రాష్ట్రాలు వాటి ఇతర అవసరాలకు మళ్లిస్తున్నట్లు తేలడంతో సెంట్రల్ స్కీమ్స్ అమలుకు ప్రత్యేక మాడ్యూల్​ను కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించింది. జిల్లా ట్రెజరీ మొదలు రాష్ట్ర జనరల్ హెడ్ అకౌంట్ వరకు  అన్నింటిని పరిశీలించేలా విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం  ప్రతినెలా కేంద్ర ప్రభుత్వంలోని ఆయా మంత్రిత్వశాఖలు ఈ స్కీమ్‌‌ల కోసం విడుదల చేసిన నిధులు, రాష్ట్రాల వాటా విడుదల, అది ఖర్చయిన తీరు, సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో ఇంకా మిగిలిపోయిన నిధులు తదితరాలపై రివ్యూ చేస్తాయి. 

సంబంధిత స్కీమ్ కోసం రాష్ట్రాలు ఖర్చుపెట్టిన వివరాలు అందిన తర్వాత మాత్రమే తదుపరి ఇన్‌‌స్టాల్‌‌మెంట్‌‌ను కేంద్రం విడుదల చేస్తుంది. నిర్దిష్టంగా ఒక స్కీమ్ కోసం కేటాయించే నిధులను దానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేయాలి. ఇతర అకౌంట్లకు మళ్లించడానికి వీలు లేదు. ఏదైనా పరిస్థితుల్లో ఆ స్కీమ్ అమలు పాక్షికంగా మాత్రమే జరిగితే మిగిలిపోయిన నిధులను బ్యాంకు ఖాతాలోనే ఉంచాలి. ఈ వివరాలను పోర్టల్‌‌లో తెలియజేయాల్సి ఉంటుంది. సెంట్రల్ స్కీమ్స్ అమలుకు  కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోని వ్యయ విభాగం మార్గదర్శకాలను రూపొందించింది.  ప్రస్తుతం ఈ విధానం పైలట్ పద్ధతిలో విజయవంతంగా అమలవుతోంది. ఒక స్కీమ్ అమలు కోసం కేంద్ర మంత్రిత్వశాఖ ప్రతి ఆర్థిక సంవత్సరం ఫస్ట్ ఇన్‌‌స్టాల్‌‌మెంట్‌‌గా 25 శాతం విడుదల చేస్తుంది. ఇందులో రాష్ట్రం తన వాటాను కూడా జమచేసి అమలు చేయాల్సి ఉంటుంది. రోజూ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు పీఎఫ్ఎంఎస్ వెబ్ పోర్టల్‌‌లో వివరాలను అప్‌‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రాల వాటా లేకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు చేసే పథకాలకు అవసరమైన నిధులు నేరుగా గ్రామాలు, మండలాలు, జిల్లాలు, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల ఖాతాలకు వెళ్తాయి.