బోరబండ-హైటెక్ సిటీ రోడ్డుకు నిధులు

బోరబండ-హైటెక్ సిటీ రోడ్డుకు నిధులు

హైదరాబాద్, వెలుగుబోరబండ – -హైటెక్‌ సిటీ  మార్గంలో రోడ్డు విస్తరణకు రూ. 23.76 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రోజూ వేల వాహనాలతో రద్దీగా ఉండే ఈ రోడ్డు ప్రస్తుతం బోరబండలో చాలా ఇరుకుగా ఉంది. దీంతో స్థానికులకు ఇబ్బందులు,  ట్రాఫిక్‌ జామ్‌లతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోతున్నాయి. బోరబండ, మోతీనగర్‌, వినాయక్‌ నగర్‌, పీఆర్‌ నగర్‌, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల నుంచి మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌, పటాన్‌చెరు తదితర ఏరియాలకు  దగ్గరి దారి కావడంతో  వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బోరబండలో రోడ్డు విశాలంగా లేకపోవడంతో తరచూ ట్రాఫిక్‌ జామ్‌లు అవుతుంటాయి. ఇక్కడ ఐటీ ఉద్యోగులు, కార్మికులు, వివిధ సంస్థల్లో పనిచేసే వారు ఎక్కువగా ఉంటారు.  ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఉంటుంది. ఆ సమయాల్లోనే ట్రాఫిక్‌ జామ్‌లు అవుతాయి. ఈ రోడ్డను  విస్తరించాలని చాలాకాలంగా స్థానికులు కోరుతున్నారు. బోరబండ బస్టాప్‌ నుంచి కూరగాయల మార్కెట్‌, హాజీ మస్తాన్‌ స్వీట్‌హౌస్‌, స్వరాజ్య నగర్‌, అబ్బుబాయ్‌ మటన్‌ షాప్‌ మీదుగా సైట్‌– –3 కాలనీ వరకు రోడ్డును 60 అడుగులకు విస్తరించాలని మూడేళ్ల క్రితం బల్దియా అధికారులు నిర్ణయించారు. బోరబండ డివిజన్‌ పరిధిలో 228, అల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలో 38 ఆస్తులను గుర్తించి అధికారులు మార్కింగ్‌ కూడా చేశారు. విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించేందుకు నిధుల కొరత ఆటంకంగా మారింది. ఆస్తులు కోల్పోతున్న షాపుల యజమానులు విస్తరణను వ్యతిరేకించడంతో మరింత జాప్యం జరిగింది. ప్రస్తుతం రోడ్డు విస్తరణ నిధులకు ఆమోదం లభించింది. 42 ఆస్తులకు సంబంధించి మొత్తం రూ. 23.76 కోట్ల మంజూరయ్యాయి.  ఆస్తులు కోల్పోతున్న వారికి చెక్కులు అందిన తర్వాత  పనులు ప్రారంభిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.

ఏడాదిన్నర కిందట

దాదాపు ఏడాదిన్నర క్రితం రోడ్డు విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోతున్న ఆరుగురికి చెక్కులు అందించిన అధికారులు పనులు చేపట్టారు. ఆ తర్వాత రెండో విడత చెక్కుల పంపిణీ జరగకపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ సమస్య ఎప్పటిలాగే ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ విభాగాల మధ్య సమన్వయ లోపం కారణంగా పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. మోతీనగర్‌ నుంచి బోరబండ బస్టాప్‌ వరకు రహదారి విశాలంగా ఉంది. అక్కడి నుంచి సైట్‌- –3 వరకుప్రధాన రహదారి కొన్నిచోట్ల 10 అడుగులు, మరికొన్ని చోట్ల 20 అడుగులతో ఉంది. ఇరువైపులా దుకాణాలు, ఫుట్‌పాత్‌ వ్యాపారాలతో పాటు భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలతో ఈ మార్గం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ చొరవతో బోరబండ బస్టాప్‌ ప్రాంతంలో రహదారి విశాలంగా మారింది.  ప్రస్తుతం ఈ మార్గంలో ఆటోలు మాత్రమే తిరుగుతుండగా,  ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. అయితే బస్టాప్‌ నుంచి చేపట్టాల్సిన విస్తరణలో ఆస్తులు కోల్పోయే వారికి పరిహారం త్వరగా చెల్లించాల్సి ఉంది. కొంతమందికి చెల్లించాల్సిన పరిహారాన్ని తక్కువగా లెక్కకట్టిన కేసులూ ఉన్నాయి.