అధికార లాంఛనాలతో ఎఫ్​ఆర్వో శ్రీనివాస్ అంత్యక్రియలు

అధికార లాంఛనాలతో ఎఫ్​ఆర్వో శ్రీనివాస్ అంత్యక్రియలు

పాడె మోసిన మంత్రులు ఇంద్రకరణ్​రెడ్డి,  పువ్వాడ అజయ్

ఖమ్మం, వెలుగు: గొత్తికోయల దాడిలో చనిపోయిన ఫారెస్ట్​ రేంజ్​ ఆఫీసర్​ చలమల శ్రీనివాసరావు అంత్యక్రియలు బుధవారం అధికార లాంఛనాలతో ముగిశాయి. శ్రీనివాసరావు సొంతూరు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్​ రెడ్డి,  పువ్వాడ అజయ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పాల్గొని పాడె మోశారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం శ్రీనివాసరావు చితికి ఆయన కుమారుడు యశ్వంత్  నిప్పంటించారు. ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు రాములు నాయక్, మెచ్చా నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్​, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ దోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్​ జైస్వాల్, ఖమ్మం కలెక్టర్  వీపీ గౌతమ్​, కొత్తగూడెం కలెక్టర్​ అనుదీప్​, కొత్తగూడెం ఎస్పీ వినీత్ తదితరులు పాల్గొన్నారు.  

ఆయుధాలివ్వాలంటూ ఫారెస్ట్​ స్టాఫ్ డిమాండ్​​

ఆయుధాలు లేకుండా డ్యూటీలు చేయడం వల్ల తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతున్నదని ఫారెస్ట్​ ఆఫీసర్లు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధాలు ఇచ్చేవరకు ఫీల్డ్​ డ్యూటీలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి  అటవీశాఖ అధికారులు, సిబ్బంది శ్రీనివాసరావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.  అనంతరం.. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారు మంత్రులను కోరారు. ఆయుధాలు లేకుండా పోడు భూముల సర్వేలో పాల్గొనాల్సి రావడం వల్లే శ్రీనివాస రావు హత్య జరిగిందని అన్నారు.  అన్ని అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరి స్తామని మంత్రులు హామీ ఇచ్చారు.  అంత్యక్రియలు జరుగుతుండగా ఆఫీసర్లు, సిబ్బంది తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో అంత్యక్రియలు పూర్తి కాగానే పోలీసులు మంత్రులను అక్కడి నుంచి పంపిం చేశారు. ఈ సమయంలో కొందరు కలెక్టర్​కు వ్యతిరేకంగా స్లోగన్స్​ చేశారు. ఒక దశలో పోలీసులకు, అటవీశాఖ సిబ్బందికి మధ్య స్వల్ప తోపులాట జరిగింది.