రేపు మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు

రేపు మధ్యాహ్నం  కృష్ణంరాజు అంత్యక్రియలు

సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్.. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. సీఎం  ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు. కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటన్న కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని తెలిపారు.  

ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస

గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు ...గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. పోస్ట్ కోవిడ్ సమస్యలు రావడంతో ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు అసుపత్రిలో జాయిన్ అయ్యారు. అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇప్పటికీ రెండు సార్లు పోస్ట్ కొవిడ్ సమస్యలతో ఆయన బాధ పడ్డట్టు సమాచారం. పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఆయన ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు. కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో  జరగనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.