పేపర్ లీకులతో నిరుద్యోగులు ఆగమేనా?

పేపర్ లీకులతో  నిరుద్యోగులు ఆగమేనా?

ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టించలేడు అనే చందంగా ఇటీవల కాలంలో  టీఎస్‌‌పీఎస్సీ నిర్వహించిన ఎఈ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం నిరుద్యోగ యువతను ఆశ్చర్యానికి గురుచేసింది. నియామక మండలి లో ఒక సాధారణ ఉద్యోగి ఇలాంటి వ్యవహారానికి ఒడిగట్టాడంటే పెద్ద స్థాయిలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు ఇంకా ఏ విధంగా ఇలాంటి లీకేజీలు చేస్తున్నారో అనే అనుమానం నిరుద్యోగ యువతలో కలుగుతుంది, చాలాకాలం తర్వాత ఉద్యోగ ప్రకటనలు రాగానే లక్షలాదిమంది యువతీ, యువకులు ఈసారి తప్పనిసరిగా ఉద్యోగం సాధించాలని కృతనిశ్చయంతో పట్టణాల బాట పట్టి ఉద్యోగాలకు ప్రిపేర్  అవుతున్నారు.  తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నియామక మండలిని పటిష్టం చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు నియామక మండలిని పటిష్టం చేయలేదని ఈ సంఘటన రుజువు చేసింది, ఒక యువతి కోసం ఒక సాధారణ ఉద్యోగి ఇలాంటి సంఘటనకు పాల్పడతాడంటే ఎవ్వరూ కూడా ఊహించలేరు.

చైర్మన్​ పర్యవేక్షణ ఉండదా?

 గ్రూప్-2,  గ్రూప్ -4 ఉద్యోగాలకే 10 లక్షల పైగా ఉద్యోగార్థులు అప్లై చేసుకున్నారు.  ఎంతో ఆశతో చదువుతున్న ఈ సందర్భంలో, ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడంతో నిరుద్యోగులు  మానసిక ధైర్యం కోల్పోతున్నారు. 2017 నుంచి నియామక మండలి లో సాధారణ ఉద్యోగిగా పనిచేస్తున్న లీకువీరుడు  ఇన్ని  సంవత్సరాలలో  ఎన్ని  వ్యవహారాలు నడిపి ఉండవచ్చో ఊహించడం కష్టమే.  గురుకుల పరీక్షలలో ఏదో సమస్య ఉందని నియామక మండలికి వచ్చిన సదరు యువతికి ఇతను పరిచయం కావడంతో ఆ యువతికి గురుకులంలో జాబు కూడా వచ్చింది. గతంలో టీఎస్​పీఎస్సీలో పని చేసిన వారు చెప్పిన దాని బట్టి చూస్తే, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అంతా కూడా చైర్మన్ పర్యవేక్షణలో ఉంటుందని చెప్తున్నారు.  ఒక సాధారణ ఉద్యోగికి పాస్వర్డ్ ఎలా దొరుకుతుందని నిరుద్యోగుల  అనుమానం .  గతంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ లో లాలాపేటలో ఒక సెంటర్లో పరీక్ష పూర్తయినప్పటికీ అదనంగా రెండు గంటలపాటు పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో  టీఎస్‌‌పీఎస్సీ, కొంతమంది బడా బాబుల పిల్లలు  పరీక్షలు రాసినట్లు అప్పట్లో  వార్తలు వచ్చాయి, విచిత్రం ఏమిటంటే సదరు నిందితుడు కూడా పరీక్ష రాసినట్లు ఓఎంఆర్ షీట్ సోషల్ మీడియాలో రావడం జరిగింది.  

భవిష్యత్తుకు భరోసా ఉందా?

రాబోయే ఈ ఆరు నెలల కాలంలో పోలీస్, గ్రూప్స్ ఇంకా చాలా పరీక్షలు అయ్యే అవకాశం ఉంది.  ఇందులో టీఎస్‌‌పీఎస్సీ  నే ఎక్కువగా పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. లక్షలాదిమంది నిరుద్యోగులు సన్నద్దమవుతున్న ఈ సమయంలో భవిష్యత్తులో జరగబోయే పరీక్షలకు ప్రభుత్వం ఏ విధంగా భరోసా ఇస్తుందో చూడాలి. ఎక్కడో గుజరాత్ లో రైలు గేదెను గుద్దితే స్పందించే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇంత పెద్ద వ్యవహారం జరిగినా ఏ మాత్రం స్పందన లేదు. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను పెట్టినప్పటికీ కూడా ఈ వ్యవహారం జరిగిందంటే ప్రభుత్వం యొక్క తప్పిదం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి.  డబ్బు ఉన్నవాడు దొంగ మార్గంలో పరీక్షా పత్రాలను లీకేజీ చేయిస్తున్నాడు. ఇలాంటి సమయంలో అప్పులు చేసి పేద విద్యార్థి ఉద్యోగం సాధించడం సాధ్యమవుతుందా? అనే ప్రశ్న తెలంగాణ సమాజంలో ఉత్పన్నమవుతుంది. సాధారణంగా తెలంగాణ సమాజంలో ఇంతవరకు కూడా నానుడి ఉంది డబ్బు ఉన్న వాడికే జాబ్ వస్తుందిలే మన పేదవాడికి జాబు రాదు మనం డబ్బు పెట్టలేమని అనుకుంటున్నారు. ఈ సంఘటనతో అది పూర్తిగా నిరూపితమైందని అనిపిస్తున్నది. ఈ సంఘటనలో నిందితుల అరెస్టుతో ఆపకుండా సదరు నిందితుడి యొక్క ఆర్థిక లావాదేవీలను పూర్తిగా పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి  సంబంధం లేనట్టుగా వివరిస్తున్నప్పటికీ అందరూ  ప్రభుత్వం నియమించిన అధికారులు, ఉద్యోగులే ఆ నియామక మండలి లో ఉన్నారు. 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గొప్పగా ప్రకటించిన ముఖ్యమంత్రి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు  జరగవని  ప్రకటించాల్సిన అవసరం ఉంది. అప్పుడే భవిష్యత్తులో జరగబోయే పరీక్షలపై నిరుద్యోగుకు కాస్తయినా భరోసా ఉంటుంది. లేదంటే నిరుద్యోగులు అప్పుల పాలయి, చివరకు తమ కుటుంబాలను సాదుకోలేక ఆత్మహత్యలకు  పాల్పడితే ఎవరు బాధ్యులో ప్రభుత్వమే ఆలోచించాలి.

నిరుద్యోగుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు

ఎన్నో పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసింది. టీఎస్‌‌పీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ లో రిజిస్టర్ అయిన నిరుద్యోగుల సంఖ్య దాదాపుగా 30 లక్షల పైగానే ఉంది.  వీరందరూ  తమ తమ అర్హత తగ్గట్టు ఉద్యోగాలకు అప్లై చేసుకుని హైదరాబాదులో దిల్​సుఖ్​నగర్, ఆశోక్ నగర్, యూనివర్సిటీల్లో  ఉంటూ  వేలాది రూపాయలు  కట్టి కోచింగ్ లు తీసుకోవడం, రూములు అద్దెకు తీసుకోవడం, రీడింగ్ రూమ్ లను అద్దెకు తీసుకోవడం, హాస్టళ్లలో ఉండడం, సమయానికి అన్నం తినకుండా కోచింగ్ కు పోవడం, నగరంలో పెట్టే ఐదు రూపాయల భోజనాలను తింటూ, ఆరోగ్యాలు పాడవుతున్నా లెక్కచేయకుండా సొంత కుటుంబాలకు దూరంగా ఉంటూ చదువుతున్నారు. అప్పులు చేసి రూ. లక్షలు ఖర్చుపెట్టి అనేక కష్టాలను అనుభవిస్తూ తక్కువ పోస్టులు ఉన్నా  కష్టపడితే మాకు ఉద్యోగం వస్తుంది అనే ఆశతో నిరుద్యోగ యువత చదువుకుంటున్నారు. 
- డా.చింత ఎల్లస్వామి,
ఉస్మానియా యూనివర్సిటీ