విశాఖలో జీ–20 సదస్సుకు సర్వ సన్నద్ధం

విశాఖలో జీ–20 సదస్సుకు సర్వ సన్నద్ధం
  • జీ–20 దేశాలతోపాటు యూరోపియన్‌ దేశాల నుంచి 57 మంది ప్రతినిధుల రాక
  • తొలిరోజు సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హాజరు

విశాఖ మహా నగరం జీ–20 సదస్సుకు సిద్ధమైంది. మార్చి 28వ తేదీ నుంచి జీ–20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యూజీ) సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సు వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో 28, 29, 30, 31 తేదీల్లో విశాఖలో జరగనుంది. నగరంలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు జీ–20 దేశాలతో పాటు యూరోపియన్‌ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. వీరికి అవసరమైన రవాణా, వసతి, భద్రతా ఏర్పాట్లు చేశారు. అతిథులను స్వాగతించడానికి ప్రత్యేక సాంస్కృతిక బృందాలను సిద్ధం చేశారు.

హాజరుకానున్న సీఎం జగన్‌

జీ–20 సదస్సు తొలిరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. సదస్సులోని ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడి.... అనంతరం గాలా డిన్నర్‌లో పాల్గొంటారు. రాత్రికి ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను సీఎం జగన్ వివరించనున్నారు. ఈ సదస్సు ద్వారా విశాఖకు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. 

2,500 మందితో భద్రతా ఏర్పాట్లు

జీ–20 సదస్సు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. సుమారు 2,500 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ప్రత్యేక ఆకర్షణగా పూలు 

విద్యుత్‌ స్తంభాలకు విద్యుద్దీపాలను అలంకరించారు. జీ–20 సదస్సుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వైఎంసీఏ నుంచి ఆర్కే బీచ్‌ వరకు వైజాగ్‌ కార్నివాల్, ఆర్కే బీచ్‌ నుంచి 3కే, 5కే, 10 మారథాన్, పారా మోటార్‌ ఎయిర్‌ సఫారీనిర్వహించారు. జి–20 సమావేశాల సందర్భంగా రూ.157 కోట్లతో విశాఖ నగరం సర్వాంగ సుందరంగా తయారైంది. విదేశీ ప్రతినిధులు పర్యటించే ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. 

జీ–20 దేశాలివీ..

అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా,ఫ్రాన్స్, జర్మనీ, భారత్,ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌.