మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీర అందించే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే ఇందిరా మహిళాశక్తి కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలు వివిధ వ్యాపారాలు చేస్తూ వ్యాపార రంగంలో నిలదొక్కుకుంటున్నారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నది.
ఆర్థికంగా బలపడేందుకు..
మహిళల స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళాశక్తి’ పథకంతో మహిళా సంఘాలలోని సభ్యులకు రుణాలు అందించి.. చేయూత ఇస్తోంది. దాదాపు లక్ష కోట్ల రుణాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. మహిళా సంఘాలతో పట్టణాలలో, జిల్లాల్లో జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో లాంఛనంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించింది.
డెయిరీ యూనిట్, ఆయిల్ మిల్, మదర్ యూనిట్ (పెరటి కోళ్ల పెంపకం) కుట్టు మిషన్ కేంద్రం, బేకరీ, గిఫ్ట్ ఆర్టికల్స్, ఈవెంట్ మేనేజ్ మెంట్, మొబైల్ టిఫిన్ సెంటర్, చట్నీస్ అండ్ స్నాక్స్, మిల్లెట్స్ పౌడర్, రిటైల్ ఫిష్ స్టాల్స్ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్‌బంక్‌లు ఏర్పాటు చేసి నెలనెలా కచ్చితంగా ఆదాయం వచ్చేలా భరోసా ఇస్తోంది. స్కూల్ యూనిఫాంలు కుట్టే కుట్టుపని బాధ్యత మహిళాసంఘాలకే అప్పగిస్తున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశారు.
చీర, సారె తెలంగాణ సంప్రదాయం
ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం. గ్రామీణ ప్రాంతాల్లో 19 నవంబర్ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉండనున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా ‘మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి’ ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమం పేరిట చీరలను పంపిణీ చేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు, అలాగే 18 ఏళ్లు నిండిన ఆడపడుచులందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు, పట్టణాల్లో 35 లక్షల చీరల చొప్పున మొత్తం దాదాపు కోటి చీరలను పంపిణీ చేస్తున్నారు.
కార్మికులకు ఉపాధి
కార్మికుల నైపుణ్యం, చీరల నాణ్యత ఖ్యాతితో రాజన్న సిరిసిల్ల పేరు రాష్ట్రమంతా మారుమోగుతోంది. సిరిసిల్లలో దాదాపు 6 నుంచి 7 దశాబ్దాలుగా వస్త్ర పరిశ్రమ కొనసాగుతోంది. వస్త్ర పరిశ్రమలు వాడే విద్యుత్ కు 50 శాతం రాయితీ కల్పించారు. సిరిసిల్లలో యజమాని, ఆసామి, కార్మికుడు జాఫర్, గుమస్తా, వార్పర్, సైజింగ్, డయింగ్, మిల్ స్టోర్స్, కండెల చుట్టేవారు, జోటా రిపేర్, వెల్డింగ్ దుకాణాలు, ఆటోవాళ్లు, జోటా రిపేర్, వెల్డింగ్ దుకాణాల కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. వస్త్ర పరిశ్రమకు గతంలోని దాదాపు రూ. 300 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం విడుదల చేసింది. దశాబ్దాల కల అయిన యార్న్ బ్యాంకును వేములవాడ పట్టణంలో రూ. 50 కోట్లతో ఏర్పాటు చేసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని ఆసాములు, యజమానులకు యార్న్ ను 90 శాతం అప్పుగా, 10 శాతం సరుకుకు డీడీ చెల్లించాలని సూచించి మద్దతుగా నిలుస్తున్నది. సిరిసిల్లలోని 22 వేల మరమగ్గాలు ఉండగా.. ప్రత్య క్షంగా, పరోక్షంగా దాదాపు 10 వేల మంది కార్మికులు ఉపాధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి పథకంతో వస్త్ర పరిశ్రమలో కార్మికులకు దాదాపు 8 నెలల పాటు ఉపాధి దొరికేలా ఆర్డర్ ఇచ్చింది. దాదాపు 4 కోట్ల 34 లక్షల చీరల ఉత్పత్తికి ఆర్డర్ ఇవ్వగా తుది దశకు చేరింది. 4 కోట్ల 19 లక్షల చీరల ఉత్పత్తి పూర్తి అయింది.
అందరూ ఒకటే అనే భావన
రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి మహిళా సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులు సిరిసిల్లను సందర్శించారు. వస్త్ర ఉత్పత్తి దశలు, కార్మికుల పని విధానాన్ని పరిశీలించారు. తాము ఇన్ని రోజులు షాపింగ్ మాల్స్, బట్టల షాప్ లలో నేరుగా చీరలను కొనేవారమని, ప్రజా ప్రభుత్వం సహకారంతో నేరుగా వస్త్ర ఉత్పత్తి నాణ్యత, తెలుసుకున్నామని వివరించారు. చీరలు నాణ్యతతో తయారు చేశారని, డిజైన్లు, రంగులు తాము ఎంచుకున్నవే ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్ల కాలంలో కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం.
జి.లక్ష్మణ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాలశాఖ, కరీంనగర్
