బాల్క సుమన్కు ప్రజా సమస్యలు పట్టవు : వివేక్ వెంకటస్వామి

బాల్క సుమన్కు ప్రజా సమస్యలు పట్టవు : వివేక్ వెంకటస్వామి

అధికారంలోకి రాగానే సింగరేణి సంస్థలో 30 నుంచి 40 వేల వరకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జీ. వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. చెన్నూరు నియోజకవర్గంలో అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  సింగరేణి సంస్థలో పని చేసే కార్మికులకు సొంతిళ్లు నిర్మించుకునేందుకు రూ.15 లక్షల వరకు రుణాలు (మిత్తీ లేకుండా) ఇస్తామన్నారు. రామకృష్ణాపూర్, మందమర్రి మధ్యలో 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు.

2004లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిందని చెప్పారు. కాంగ్రెస్ మాట ఇచ్చిన్నట్లుగానే ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఓడిపోతున్నామనే భయంతోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.. కాంగ్రెస్ పై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 85 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓటు అడగనన్న కేసీఆర్... మిషన్ భగీరథ నీళ్లు చెన్నూరు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో రావడం లేదన్నారు. మేఘా కంపెనీకి లాభం చేకూర్చేందుకే మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారని అన్నారు. చెన్నూరులో తాగునీటి కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ తరపున వారికి భరోసా ఇచ్చామని చెప్పారు. 

తమ తండ్రి (కాకా వెంకట స్వామి) ఎంపీగా ఉన్న సమయంలో మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వరకూ రూ.27 కోట్ల ప్రాజెక్టు మంజూరు చేయించి.. ఈ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ తాగునీటి సమస్య లేకుండా (పర్మినెంట్ గా) చూస్తామని హామీ ఇచ్చారు. మంచి నీళ్ల కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. 

మూడోసారి అధికారంలోకి వస్తే మహిళలకు రూ.3 వేలు ఇస్తామంటున్న కేటీఆర్.. రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని చెప్పారు. రైతుబంధు పథకం డబ్బులు పెద్ద పెద్ద భూస్వాములకు ఇవ్వొద్దని, కౌలు రైతులకు ఇవ్వాలని మంచిర్యాలకు కేసీఆర్ వచ్చినప్పుడు తాను చెప్పానని గుర్తు చేశారు. 

సింగరేణి సంస్థలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ (డీఎంఎఫ్) ఫండ్స్ ను బాల్క సుమన్ తరలించి.. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల నియోజకవర్గాల్లో ఖర్చుపెట్టించారని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని పూడుస్తామని భరోసా ఇచ్చారు. ఐదేళ్లలో ఏనాడు కూడా ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదని చెప్పారు. తనకు ఎలాంటి పదవులు లేకపోయినా... చెన్నూరుకు వచ్చిన ప్రతిసారి తమ చారిటబుల్ సంస్థ ద్వారా నిరుపేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. బాల్క సుమన్ కు ప్రజల సమస్యలు పట్టవు అని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనూ భారీ అవినీతి జరిగిందన్నారు. పుస్తకాలు చదివి ఎవరైనా ప్రాజెక్టు కడుతారా..? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అన్నారు. బాల్క సుమన్ లెటర్ రాయడం వల్ల తమ ఇండ్లు, ఆఫీసులపై ఈడీ, ఐటీ దాడులు జరిగాయని చెప్పారు. కావాలని తమను నిర్బంధాలు, దాడులు చేశారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. చర్యలు తీసుకోమ్మని అమిత్ షాను కోరితే పట్టించుకోలేదన్నారు. తాను ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక్క కాంట్రాక్టు కూడా తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. 

పార్టీ మారగానే తమ ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ దాడులు చేయించారని చెప్పారు. తాము సొంత బిజినెస్ లు చేసుకుంటూ చట్టం ప్రకారం ట్యాక్సీలు కడుతున్నామని గుర్తు చేశారు. నీతి, నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటూ వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా చేస్తున్న విషయంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఫెయిల్ అవుతాయన్నారు.