కేంద్రంపై కేసీఆర్ సర్కారుది తప్పుడు ప్రచారం : వివేక్ వెంకటస్వామి

 కేంద్రంపై కేసీఆర్ సర్కారుది తప్పుడు ప్రచారం : వివేక్ వెంకటస్వామి

పెద్దపల్లి జిల్లా : సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకటస్వామి చెప్పారు. కేంద్రంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీపైనా కేసీఆర్ సర్కార్ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దేశంలోని రైతులకు అతి తక్కువ ధరలకే ఎరువులు అందించేందుకు ప్రధాని మోడీ.. రామగుండం ఎరువుల కర్మాగారంతో పాటు మరో ఐదు ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. తాడిచెర్ల మైన్ ను కేసీఆరే ప్రైవేటీకరణ చేశారని ఆరోపించారు. బీఎఫ్ ఆర్ లోకి వెళ్లిన సింగరేణి సంస్థను తమ తండ్రి వెంకట స్వామియే కాపాడారని గుర్తు చేశారు. 

గోదావరిఖని గాంధీనగర్ లో బీజేపీ శక్తి కేంద్రం ఇన్ చార్జీ, కార్పొరేటర్ దుబాసి లలిత, మల్లేష్ ఆధ్వర్యంలో ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీ. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ మల్లికార్జున్, నియోజకవర్గ ప్రభారీ పోచం, జిల్లా ఇన్ చార్జీ రాంనాథ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.