విద్యావంతుడు రఘునాథ్​ను గెలిపించండి : జి.వివేక్​వెంకటస్వామి

విద్యావంతుడు రఘునాథ్​ను గెలిపించండి : జి.వివేక్​వెంకటస్వామి
  • ఇంటింటికి పాదయాత్రలో వివేక్​ వెంకటస్వామి 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే విద్యావంతుడైన వెరబెల్లి రఘునాథ్​రావును గెలిపించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎలక్షన్​ మేనిఫెస్టో కమిటీ చైర్మన్​డాక్టర్​ జి.వివేక్​వెంకటస్వామి కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​రావుతో కలిసి ఆదివారం జిల్లా కేంద్రంలోని గొల్లవాడ, అంబేద్కర్, సుభాష్​నగర్​లో ఇంటింటికి పాదయాత్ర నిర్వహించారు. కాలనీ ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివేక్​ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్​అభివృద్ధిలో అగ్రరాజ్యాలతో పోటీపడుతోందన్నారు.

సీఎం కేసీఆర్​ఎన్నికల సందర్భంగా అనేక హామీలిచ్చి అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, మంచిర్యాలలో రఘునాథ్​రావును గెలిపించాలని ఆయన కోరారు. రఘునాథ్​రావు మాట్లాడుతూ బీఆర్​ఎస్​పై మండిపడ్డారు. ఏసీసీ ప్రాంతంలో గతంలో సిమెంట్, పైపుల కంపెనీలు ఉండేవని, ఏసీసీలో మేనేజర్​ను హత్య చేసి కంపెనీ మూసివేతకు కారణమైన వాళ్లు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు తెలుసన్నారు.

ఈ ప్రాంతంలోని కంపెనీలు మూతపడడంతో వాటిపై ఆధారపడ్డవారు ఉపాధి కోల్పోయారని వాపోయారు. బీజేపీని గెలిపిస్తే కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నాయకులు మునిమంద రమేశ్, అందుగుల శ్రీనివాస్, వంగపల్లి వెంకటేశ్వర్​రావు, రజినీష్​ జైన్, డాక్టర్​ రఘునందన్, బోయిని హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.