ఆర్ఎఫ్​సీఎల్​తో యూరియా కొరత తీరుతది

ఆర్ఎఫ్​సీఎల్​తో యూరియా కొరత తీరుతది
  • 12న ప్రధాని మోడీ బహిరంగ సభను సక్సెస్​ చేయండి

  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి పిలుపు 

చెన్నూర్, వెలుగు : రామగుండం ఫెర్టిలైజర్స్‌‌ అండ్‌‌ కెమికల్స్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌) తో తెలంగాణలో ఎరువుల కొరత తీరుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ ​వెంకటస్వామి అన్నారు. ఈ నెల 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామగుండం పర్యటనలో భాగంగా ఎరువు కర్మాగారాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం చెన్నూర్​లో ప్రెస్​మీట్​ఏర్పాటు చేశారు. 1995లో మూతబడిన ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి 2014 లోనే మోడీ ప్రభుత్వం రూ.6వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిందన్నారు.

కాంగ్రెస్​ పార్టీ హయాంలో తన తండ్రి వెంకటస్వామి ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు కృషి చేశారని చెప్పారు. తర్వాత తాను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు అనేక సార్లు అప్పటి ప్రధాని మన్మోహన్​సింగ్​ దృష్టికి తీసుకువెళ్లి కర్మాగారం తెరవడానికి కష్టపడ్డామన్నారు. 12.5 మిలియన్ టన్నుల ఉత్పత్తితో తెలంగాణలో యూరియా కొరత తీరుతుందన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించిందని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్​ నియోజకవర్గానికి మొదటిసారి ప్రధాన మంత్రి వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.