కలిసి నడుద్దాం .. జీ20 వేదికగా ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు

కలిసి నడుద్దాం ..  జీ20 వేదికగా ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
  • సభ్య దేశాల ఏకాభిప్రాయంతో ‘ఢిల్లీ డిక్లరేషన్‌’కు ఆమోదం
  • మోదీ ప్రతిపాదనతో ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం 
  • ఇప్పుడున్నది యుద్ధాల యుగం కాదన్న ప్రపంచ నేతలు
  • సమస్యల పరిష్కారానికి దౌత్యం, చర్చలే చాలా కీలకమని ప్రకటన
  • సమిట్‌ తొలి రోజు దౌత్య విజయం సాధించిన భారత్
  • 10 ముఖ్యాంశాలతో 37 పేజీలతో డిక్లరేషన్
  • డిక్లరేషన్ ఆమోదంతో చరిత్ర క్రియేట్ అయిందన్న ప్రధాని మోదీ

ప్రపంచ ప్రయోజనాల కోసం ఒక్కటిగా సాగుదామని జీ20 వేదికగా భారత్ పిలుపునిచ్చింది. ఆహార భద్రత, ఇంధనం, టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీ తదితర సవాళ్లకు పరిష్కారాలు కనుగొనేందుకు కలిసి పని చేద్దామని కోరింది. జీ20 సమిట్ తొలి రోజైన శనివారం దౌత్యపరంగా మన దేశం అద్వితీయ విజయం సాధించింది. ‘న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్’తో అన్ని దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. సుదీర్ఘ చర్చల తర్వాత.. సభ్య దేశాల అంగీకారంతో డిక్లరేషన్‌ను 100 శాతం ఏకగ్రీవంగా ఆమోదింపజేసింది. మరోవైపు జీ20 కూటమిలోకి ఆఫ్రికన్ యూనియన్‌ను ఆహ్వానిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనను సభ్య దేశాలు ముక్తకంఠంతో అంగీకరించాయి. చైనాకు చెక్ పెట్టేలా ‘ఇండియా- మిడిల్ ఈస్ట్ -యూరప్ ఎకనమిక్ కారిడార్’ ఏర్పాటు దిశగా కూడా సమిట్‌లో ముందడుగు పడింది. ఎన్విరాన్‌మెంట్, క్లైమేట్ అబ్జర్వేషన్ కోసం జీ20 శాటిలైట్‌ మిషన్‌ను ప్రారంభించాలని భారత్​ ప్రతిపాదించింది. 

తొలి రోజు సమావేశాల తర్వాత రాత్రి భారత్ మండపంలో జీ20 గెస్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందుకు ఆయా దేశాల అధినేతల, ఇతర ప్రతినిధుల భార్యలు చీరకట్టు, భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చారు. ఇక జీ20 హై టేబుల్‌పై ప్రధాని మోదీ కుర్చీ వద్ద ఇండియాకు బదులుగా ‘భారత్’ అని రాసిన నేమ్ ప్లేట్ ఏర్పాటు చేయడం విశేషం.

న్యూఢిల్లీ: 
తన జీ20 ప్రెసిడెన్సీలో గుర్తుండిపోయే దౌత్య విజయాన్ని ఇండియా సాధించింది. సమిట్ తొలిరోజే ‘న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్’ను ఆమోదింపజేసింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భిన్నాభిప్రాయాల నేపథ్యంలో.. ఏకాభిప్రాయం సాధ్యం కాదనే ఊహాగానాలను పటాపంచలు చేస్తూ.. సభ్య దేశాల 100 శాతం ఏకాభిప్రాయంతో డిక్లరేషన్‌‌ను ఓకే చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ‘‘మిత్రులారా.. మనకు ఇప్పుడే శుభవార్త అందింది. మన బృందాల కృషితో, మీ అందరి సహకారంతో ‘న్యూఢిల్లీ జీ20 సమిట్ లీడర్స్ డిక్లరేషన్‌‌’పై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ డిక్లరేషన్ ఆమోదం పొందినట్లు ప్రకటిస్తున్నా” అని చెప్పారు. ఇది సాధ్యమయ్యేలా కృషి చేసిన వారందరికీ  హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. వీరంతా ప్రశంసలకు అర్హులని అన్నారు. ‘‘న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్‌‌ను ఆమోదించడం ద్వారా చరిత్ర క్రియేట్ అయింది. ఏకాభిప్రాయం, స్ఫూర్తితో మెరుగైన, మరింత సంపన్నమైన, సామరస్యపూర్వక భవిష్యత్తు కోసం సహకారంతో పని చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. తమ మద్దతు, సహకారానికి జీ20 సభ్యులందరికీ నా కృతజ్ఞతలు” అని ప్రధాని ట్వీట్ చేశారు. 

దురాక్రమణలకు దూరంగా ఉండాలి

ఇప్పుడున్నది యుద్ధాల యుగం కాదని 37 పేజీలతో కూడిన ‘జీ20 దేశాల న్యూఢిల్లీ డిక్లరేషన్‌‌’లో మరోసారి స్పష్టంచేశారు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారంతో సహా అంతర్జాతీయ చట్టం సూత్రాలను అన్ని రాష్ట్రాలు పాటించాలని, వివాదాలకు శాంతియుత పరిష్కారానికి దౌత్యం, చర్చలు చాలా కీలకమని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌‌‌‌కు అనుగుణంగా ఏదైనా ప్రాదేశిక సమగ్ర, సార్వభౌమత్వానికి, రాజకీయ స్వేచ్ఛకు భంగం కలిగించకుండా, ప్రాదేశిక దురాక్రమణలకు దూరంగా ఉండాలని చెప్పారు. అణ్వాయుధాల వాడకాన్ని, వాటిని చూపి బెదిరించడాన్ని ఏమాత్రం ఆమోదించబోమని తేల్చిచెప్పారు. ‘‘జీ20 అనేది.. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రధాన వేదిక. భౌగోళిక రాజకీయ, భద్రతా సమస్యలను పరిష్కరించడానికి వేదిక కాదు. అయినప్పటికీ ఈ సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ముప్పును కలిగిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం కారణంగా పడుతున్న దుష్పరిణామాలను పరిష్కరించేందుకు సమష్టిగా కృషి చేస్తాం” అని ప్రకటించారు. ‘‘ఉక్రెయిన్‌‌లో యుద్ధం కారణంగా ప్రపంచ ఆహార, ఇంధన భద్రత, సరఫరా గొలుసులు, స్థూల-ఆర్థిక స్థిరత్వం, ద్రవ్యోల్బణం, వృద్ధి తదితరాలపై ప్రతికూల ప్రభావం పడింది. రష్యా, ఉక్రెయిన్‌‌ నుంచి ధాన్యం, ఆహార పదార్థాలు, ఎరువులు, ఇతర ముడి పదార్థాలను ఎలాంటి అడ్డుంకులు లేకుండా సరఫరా చేయాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆఫ్రికాలోని పేద దేశాల అవసరాలు తీర్చుకోవడానికి ఇది అవసరం” అని పేర్కొన్నారు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా ఖండిస్తున్నామని జీ20 నాయకులు చెప్పారు.

పారదర్శక వ్యవస్థ అత్యవసరం

అందరికీ అభివృద్ధి, శ్రేయస్సును అందించే ట్రేడ్, పెట్టుబడి విధానాలకు మద్దతు ఇవ్వడానికి అంగీకరించాయి. నిబంధనల ఆధారిత, వివక్ష లేని, న్యాయమైన, బహిరంగ, సమ్మిళిత, సమానమైన, స్థిరమైన, పారదర్శక మల్టీలేటరల్ వాణిజ్య వ్యవస్థ అనివార్యమని తేల్చిచెప్పాయి.

5.9 ట్రిలియన్లు కావాలి

గ్లోబల్ వార్మింగ్‌‌ను తగ్గించే లక్ష్యంతో తమ జాతీయ వాతావరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2030 లోపు 5.9 ట్రిలియన్ డాలర్లు అవసరమవుతాయని జీ20 అభిప్రాయపడింది. 200 గంటలు చర్చలుడిక్లరేషన్‌‌పై ఏకాభిప్రాయం తెచ్చేందుకు దాదాపు 200 గంటల సంప్రదింపులు జరిపినట్లు ఇండియా షెర్పా(అధికార ప్రతినిధి) అమితాబ్ కాంత్ వెల్లడించారు. ఉక్రెయిన్‌‌– రష్యా యుద్ధం అంశంపై జీ20 లీడర్ల మధ్య భిన్నాభిప్రాయాల నేపథ్యంలో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వివరించారు. తొలుత ఇండియా, బ్రెజిల్, సౌతాఫ్రికా, ఇండోనేసియా.. తర్వాత మెక్సికో, తుర్కియే, సౌదీ అరేబియా ఉమ్మడి ప్రయత్నాలతోనే ఇది సాధ్యమైందన్నారు.

జీ20 శాటిలైట్ మిషన్

గ్లోబల్ సౌత్ దేశాలకు సాయం చేసే లక్ష్యంతో.. ఎన్విరాన్‌‌మెంట్, క్లైమేట్ అబ్జర్వేషన్ కోసం జీ20 శాటిలైట్‌‌ మిషన్‌‌ను ప్రారంభించాలని ఇండియా ప్రతిపాదించింది. విజయవంతమైన చంద్రయాన్ మిషన్ నుంచి పొందిన డేటా మాదిరి.. ఈ మిషన్ మానవాళికి ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధాని అన్నారు. ఇదే స్ఫూర్తితో ‘జీ20 శాటిలైట్ మిషన్ ఫర్ ఎన్విరాన్‌‌మెంట్ అండ్ క్లైమేట్ అబ్జర్వేషన్’ను ప్రారంభించాలని భారత్ ప్రతిపాదిస్తున్నదని తెలిపారు. ఈ మిషన్ నుంచి పొందిన డేటాను అన్ని దేశాలతో, ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌‌లోని దేశాలతో పంచుకోవాలని అన్నారు. ఈ ఇనిషియేటివ్‌‌లో చేరాలని జీ20 దేశాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

డిక్లరేషన్‌‌లోని ముఖ్యాంశాలు

  •     బలమైన, స్థిరమైన, సమతుల్య, సమ్మిళిత వృద్ధి..  డెవలప్‌‌మెంట్ గోల్స్‌‌ పురోగతిని వేగవంతం చేయడం.
  •     సుస్థిర అభివృద్ధి కోసం గ్రీన్ డెవలప్‌‌మెంట్ ప్యాక్ట్.. సెంచరీ కోసం మల్టీలేటరల్ ఇన్‌‌స్టిట్యూషన్స్.. టాక్సేషన్
  •     ట్రాన్స్‌‌ఫర్మేషన్, డిజిటిల్ పబ్లిక్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్.. సమానత్వం, మహిళల సాధికారత
  •     ఆర్థిక రంగ సమస్యలు.. టెర్రరిజం, 
  • మనీ ల్యాండరింగ్‌‌పై కౌంటర్ చర్యలు
  •     మరింత సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించడం.