
ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన చిత్రం ‘గం గం గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్. ఈ నెల 31న సినిమా విడుదలవుతోంది. సోమవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ ‘టీమ్ అందరికీ ఈ సినిమా ఎంత ముఖ్యమో నాకు తెలుసు. సినిమా సక్సెస్ అందుకుని ఆనంద్ మొహంలో నవ్వు చూడాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది.
కార్యక్రమానికి హాజరైన దర్శకులు అనుదీప్, సాయి రాజేష్, నిర్మాతలు బన్నీ వాసు, ఎస్‌కేఎన్, మధుర శ్రీధర్ రెడ్డి సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఏ సినిమాలోనూ కనిపించనంత ఎనర్జిటిక్‌గా ఇందులో కనిపిస్తా. సమ్మర్‌కు ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్’ అని అన్నాడు. తమ కెరీర్‌లో ఇది స్పెషల్ మూవీ అన్నారు హీరోయిన్స్.
డైరెక్టర్ ఉదయ్ శెట్టి మాట్లాడుతూ ‘కామెడీ మూవీ అనుకుంటే థ్రిల్ చేస్తుంది, థ్రిల్లర్ అనుకుంటే నవ్విస్తుంది, రెగ్యులర్ యాక్షన్ కామెడీ అనుకుంటే సర్‌ప్రైజ్ చేస్తుంది’ అని చెప్పాడు. ఈ సినిమాతో ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నిర్మాతలు అన్నారు. నటులు సత్యం రాజేష్, కృష్ణ చైతన్య, యావర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి, డ్యాన్స్ మాస్టర్ విజయ్ పొలాకి, కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని పాల్గొన్నారు.