హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే తొలి స్టేడియం స్పోర్ట్స్ హ్యాకథాన్ 2,132 వినూత్న ఐడియాలు, పరిష్కారాలతో రికార్డు స్థాయిలో విజయవంతమైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 24 గంటల నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ ఈవెంట్‌లో ప్లేయర్లు, స్టూడెంట్స్, ఇన్నొవేటర్లు కలిసి కరాటే, వాలీబాల్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, పవర్‌లిఫ్టింగ్, చెస్, క్యారమ్స్ వంటి 24 రకాల క్రీడల్లో ఎదురయ్యే సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలను ఆవిష్కరించారు.
ఇవి క్రీడల పనితీరు మెరుగుదల, శిక్షణ విధానాలు, ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులను చూపిస్తున్నాయి. వీటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం తమ లక్ష్యమని హ్యాకథాన్ బ్రాండ్ ఓనర్ మక్తాల సందీప్ కుమార్ తెలిపారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కార్యక్రమాన్ని అభినందించారు.
