కొప్పుల ఈశ్వర్ దోచుకున్నది ఇక చాలు : గడ్డం వంశీకృష్ణ

కొప్పుల ఈశ్వర్ దోచుకున్నది ఇక చాలు : గడ్డం వంశీకృష్ణ

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కు మద్దతుగా పెద్ద సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి.. కొప్పుల ఈశ్వర్ కు డిపాజిట్లు కూడా రావని తనకు తెలుస్తోందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి జీ. వివేక్ వెంకటస్వామి కుమారుడు, గడ్డం వంశీకృష్ణ. కొప్పుల ఈశ్వర్ దోచుకున్నది ఇక చాలు అని హెచ్చరించారు. మొదట్లో సైకిల్ పై తమ తాత (కాక వెంకటస్వామి) వద్దకు వచ్చి కలిసేవారని, తనకు  చాలా బాగా గుర్తుందన్నారు. ఇప్పుడు కోట్లు కోట్లు సంపాదించి.. ప్రజలపై దౌర్జన్యాలు చేస్తూ.. అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలోని వివేకానంద చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో తీన్మార్ మల్లన్నతో పాటు గడ్డం వంశీ కూడా పాల్గొని మాట్లాడారు. ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.  

తెలంగాణ రాకముందు సింగరేణి కాలనీల్లో లక్ష ఉద్యోగాలు కాక వెంకటస్వామి ఇప్పించారని గుర్తు చేశారు గడ్డం వంశీ. చాలామంది ఉద్యోగాలను కాపాడరని చెప్పారు. తమ తాత హయంలోనే జైపూర్ పవర్ ప్లాంట్ ప్రారంభించారని తెలిపారు. దాదాపు 75 వేల గుడిసెలు ఇప్పించారని చెప్పారు. తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు మారుతాయనుకుంటే..  10 ఏళ్ల తర్వాత బ్రోకర్ల తెలంగాణగా మారిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను తరిమి తరిమి కొట్టే సమయం వచ్చిందని చెప్పారు.

తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని నమ్మామని, కానీ.. ఎవరికీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు గడ్డం వంశీ. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న యువతీ, యువకులు.. ఇప్పుడు నిరుద్యోగ తెలంగాణ ఉద్యమం నడిపించాలని కోరారు. కేసీఆర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ ను నిరుద్యోగులుగా చేయాలా..? వద్దా..? అని ప్రశ్నించారు. నవంబర్ 30వ తేదీన జరగబోయే ఎలక్షన్స్ లో కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.