బీఆర్ఎస్, బీజేపీ నేతలు తోడు దొంగలు : గడ్డం వినోద్

బీఆర్ఎస్, బీజేపీ నేతలు తోడు దొంగలు : గడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీఆర్ఎస్, దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటేనని.. క్రైస్తవులు వారిని నమ్మి ఓట్లేయొద్దని బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ పిలుపునిచ్చారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని సీఎస్ఐ చర్చి వద్దకు వెళ్లి క్రైస్తవులను వినోద్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించాలని, క్రైస్తవుల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. 

ఈ సందర్భంగా చర్చి పాస్టర్ వినోద్​కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తరువాత పట్టణంలోని 22వ వార్డు బూడిదిగడ్డ బస్తీలో పార్టీ నేత మునిమంద రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నమూనా బ్యాలెట్​పై వినోద్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈవీఎంపై 2వ నంబరు బటన్​ నొక్కి తన ఫొటోతో ఉన్న కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు  ఓట్లేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. 

ఈ కార్యక్రమంలో పార్లమెంటు మాజీ సభ్యుడు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సిరిసిల్ల రాజయ్య, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, టౌన్ ఎన్నికల ఇన్​చార్జ్ కేవీ ప్రతాప్, మున్సిపల్ మాజీ చైర్మన్లు మునిమంద స్వరూప, మత్తమారి సూరిబాబు, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, ఓబీసీసెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్ యాదవ్ ఇతర లీడర్లు పాల్గొన్నారు.          

కేసీఆర్​ను ప్రజలే తరిమి కొడతరు: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ రాజయ్య
 
ప్రాణ త్యాగాల ద్వారా వచ్చిన తెలంగాణను పదేండ్లు పాలించి నేడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన సీఎం కేసీఆర్​ను ప్రజలు రాళ్లతో కాదు.. ఓటుతో తరిమి కొడతారని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. గడ్డం వినోద్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాజయ్య మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల ప్రజల సొమ్మును కేసీఆర్ లూటీ చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 

బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య రెండు సార్లు గెలిచి భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించడం తప్ప నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు వచ్చిన మాజీ కేంద్రమంత్రి దివంగత వెంకటస్వామి(కాకా) తనయుడు గడ్డం వినోద్ ను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా విభాగం టౌన్ ప్రెసిడెంట్ పొరండ్ల సత్యవతి కాంగ్రెస్​లో చేరారు. ఆమెకు వినోద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

కాంగ్రెస్ గెలిస్తే బెల్లంపల్లికి ఇంజనీరింగ్, పీజీ కాలేజీలు వస్తాయ్

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నయ్య బెల్లంపల్లిలో ప్రధాన డిమాండ్ గా ఉన్న మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్, పీజీ కాలేజీలు తేలేదని.. ఇలాంటి వ్యక్తికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఎన్ఎస్ యూఐ జిల్లా ప్రెసిడెంట్ ఆదర్శ్ వర్ధన్ రాజు పిలుపునిచ్చారు. 19వ వార్డులో కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సేవ చేసేందుకు వచ్చిన గడ్డం వినోద్ ను ఆశీర్వదించి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.