
హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డిని ఇంటికి వెళ్లి మరీ కలిశారు. గురువారం నాడు మంత్రి జూపల్లి ఇంటికి కూడా కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ ప్రచారం జరగడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. గద్వాలలో సొంత పార్టీ నేతలతో కృష్ణ మోహన్ రెడ్డికి విభేదాలు ఉన్నాయని, కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరడాన్ని గద్వాల కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ తీవ్రంగా వ్యతిరేకిస్తు్న్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలవడంతో ఆయన తిరిగి సొంత గూటికి చేరుతున్నారని వార్తలు గుప్పుమన్నాయి.
కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా తిరిగి సొంత గూటికి చేరుతున్నారని బీఆర్ఎస్ శిబిరం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది. కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు నేరుగా ఆయన నివాసానికి వెళ్లడంతో బీఆర్ఎస్ ఆశలు ఆవిరయ్యాయి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో ఇప్పటికే మాట్లాడిన మంత్రి జూపల్లి స్థానికంగా ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక నేతలతో మాట్లాడి ఇబ్బందులకు చెక్ పెడతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళతానని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని జూపల్లి సూచించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ నుంచి గద్వాల ఎమ్మెల్యేకు పిలుపొచ్చింది. మంత్రి జూపల్లి మాట్లాడిన తర్వాత గద్వాల ఎమ్మెల్యే చల్లబడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్తో భేటీకి కూడా వెళ్లడంతో బీఆర్ఎస్ శిబిరం చేసుకున్న ప్రచారం ఉత్త కథగానే మిగిలిపోయింది.