
- రెండు ఫ్యామిలీల్లో ఏడుగురికి జాబ్స్
- ఏజెన్సీ ముసుగులో అధికారుల లీలలు
- బదిలీలు, ప్రమోషన్ల పేరుతో లైంగిక వేధింపులు
గద్వాల, వెలుగు: ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు, ఆఫీసర్లు కుమ్మక్కై మెడికల్, నర్సింగ్ కాలేజీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నర్సింగ్, మెడికల్ కాలేజీల్లో పని చేసే ఆఫీసర్లు తమ ఇండ్లలో పని చేసే వారి బంధువులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా రెండు ఫ్యామిలీలకు చెందిన ఏడుగురికి జాబ్‌లు ఇచ్చి నిరుద్యోగులను అన్యాయం చేశారు. కాలేజీల్లో పని చేస్తున్న ఇద్దరు ఆఫీసర్లు ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. .
మరోవైపు మూడు నెలల కింద గద్వాల నుంచి వనపర్తికి బదిలీ అయిన కొందరు ఆఫీసర్లు తమ పరపతి ఉపయోగించుకొని తిరిగి గద్వాలకు బదిలీ చేయించుకున్నారు. వారు తమపై పెత్తనం చెలాయిస్తున్నారని, మాట వినకుంటే మెమోలు జారీ చేయడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని పలువురు వాపోతున్నారు.
రెండు ఫ్యామిలీల నుంచి ఏడుగురు..
నర్సింగ్ కాలేజీలో 33 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇటీవల నియమించారు. ఇందులో రెండు ఫ్యామిలీలకు చెందిన ఏడుగురు ఉన్నారు. గద్వాల మండలం గోన్పాడుకు చెందిన ఓ మహిళ కోడలు, కూతురు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గా సెలెక్ట్ అయ్యారు. మరో శానిటేషన్ ఉద్యోగి ఫ్యామిలీలో ముగ్గురికి ఉద్యోగాలు ఇప్పించారు. మెడికల్ కాలేజీలో 56 మంది ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ను తీసుకోనుండగా, ఇందులో తమ వారిని పెట్టేందుకు కాలేజీల్లో పని చేస్తున్న సిబ్బంది పైరవీలు చేస్తున్నారు. అర్హతలు లేకపోయినా కొందరు ఆఫీసర్లు తమ ఇండ్లలో పని చేసే వారికి, వారి కుటుంబసభ్యులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించారు.
ఇలా ఐదుగురికి అర్హతలు లేకున్నా, ఏజ్ ఎక్కువగా ఉన్నా ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. వాస్తవంగా 60 ఏళ్లు పైబడిన వారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగానికి అనర్హులు. కానీ, నర్సింగ్ కాలేజీలోని ఒక ఆఫీసర్ తన పలుకుబడితో మెడికల్ రిపోర్ట్ 40 ఏండ్లకు తెప్పించి 60 ఏళ్ల వృద్ధురాలికి ఉద్యోగం ఇప్పించారు.
బదిలీ అయిన మూడు నెలలకే..
బదిలీపై వెళ్లిన ఆఫీసర్లు మూడు నెలలు తిరగకుండానే మళ్లీ ఇక్కడికి వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారని కాలేజీ సిబ్బంది వాపోతున్నారు. సదరు ఆఫీసర్లు ఏజెన్సీ నిర్వాహకుడితో కుమ్మక్కై తమను వేధిస్తున్నారని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు.
క్రిమినల్ కేసు ఉన్నప్పటికీ..
నర్సింగ్, మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసే ఏజెన్సీపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేయడంతో ఉండవల్లి పోలీస్ స్టేషన్ లో తండ్రి, కొడుకులపై కేసు నమోదైంది. వారికి చెందిన ఏజెన్సీకే నర్సింగ్, మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి.
ఉద్యోగులపై లైంగిక వేధింపులు..
ప్రమోషన్లు, మంచి పోస్టులు ఇప్పిస్తామంటూ కొందరు ఆఫీసర్లు ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై లైంగిక వేధింపులకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. మాట వినకుంటే వారిని వేరే చోటికి బదిలీ చేస్తున్నారు. లేదంటే దారికి వచ్చేంత వరకు వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమకు అనుకూలంగా ఉండే శానిటరీ వర్కర్లను ఎలాంటి విద్యార్హత లేకపోయినా వార్డెన్ గా, అటెండర్ గా ప్రమోట్ చేశారనే విమర్శలున్నాయి.
ఎంక్వైరీ చేస్తున్నాం..
ఏజ్ ఎక్కువగా ఉన్న వారిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకోవడంపై ఎంక్వైరీ చేస్తున్నాం. ఒకే ఫ్యామిలీ వారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా చేరిన మాట వాస్తవమే. దానిని ప్రక్షాళన చేస్తున్నాం. గతంలో జరిగిన తప్పిదాలు సరిదిద్దుతున్నాం. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీపై కేసు ఉన్న విషయం నాకు తెలియదు. రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటాం. - శ్రీధర్ రెడ్డి, ఏవో, నర్సింగ్ కాలేజ్