గజాననాయ నమః.. లీడర్షిప్ స్కిల్స్ అమోఘం, అద్భుతం

గజాననాయ నమః.. లీడర్షిప్ స్కిల్స్ అమోఘం, అద్భుతం

గణపయ్య పండుగంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. పదకొండు రోజులు పూజలు, నిమజ్జనాలతో క్షణం తీరిక ఉండదు. బొజ్జ గణపయ్య అంటే అంత ఇష్టం మరి వాళ్లకి, అయితే పిల్లలు పూజలు చేయడమేకాకుండా... ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది.

శివుడు ఓసారి తన ఇద్దరు కొడుకులైన వినాయకుడు, కుమారస్వామిని ప్రపంచం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయమంటాడు. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం మీద బయలుదేరతాడు. కానీ, వినాయకుడి వాహనం ఎలుక. ఎంత ప్రయత్నించినా కుమార స్వామి కంటే ముందు లోకాన్ని చుట్టలేడు. దాంతో, కొద్దిసేపు ఆలోచించి శివపార్వతుల చుట్టూ తిరగడం మొదలు పెడతాడు. ఎందుకంటే అతని దృష్టిలో తల్లిదండ్రులే ప్రపంచం. వాళ్లంటే ఆయనకు ఉన్న భక్తి, ప్రేమ గౌరవం అలాంటిది. ఈ ప్రదక్షిణలతో గెలిచాడు కూడా. దీని ద్వారా కష్ట సమయంలో ఎలా ఆలోచించాలో ప్రపంచానికి చెప్పాడు వినాయకుడు. తల్లిదండ్రులే దేవుడికి ప్రతిరూపాలు, వాళ్లని ప్రేమించండి, గౌరవించండి. అనే సందేశాన్ని కూడా ఇచ్చాడు.

పెద్ద చెవులు

వినాయకుడు మంచి శ్రోత. ఏదైనా విషయాన్ని ఎదుటివాళ్లకు అర్ధమయ్యేలా చెప్పాలన్నా, కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, ముందు మంచి శ్రోతగా మారాలి. వినాయకుడి పెద్ద చెవులు అదే చెబుతాయి. అందుకే ఎవరు ఏం చెప్పినా ముందు వినాలి. అది మన దగ్గరున్న సమాచారాన్ని సరిచూసుకునేందుకు మంచి నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.

తొండం

ఎటంటే అటు తిరిగే వినాయకుడి తొండం పరిస్థితులకు తగ్గట్టుగా అడ్జస్ట్ కావడం మనకు నేర్పిస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా మారిన వాళ్లే జీవితంలో గెలుపు సొంతం చేసుకుంటారు.

ఏకాగ్రత ఎక్కువ

వినాయకుడి కళ్లు ఏకాగ్రతకి సింబల్, ఇంకా.. చాలా పెద్దగా ఆలోచించాలని, పెద్ద కలలు ఉండాలని వినాయకుడి పెద్ద తల చెబుతుంది. ఏం తిన్నా జీర్ణం చేసుకోవాలి. మంచి, చెడుని కూడా జీర్ణం చేసుకోవాలని వినాయకుడి పెద్ద పొట్ట చెబుతుంది.

రివార్డులే లడ్డూలు

కష్టపడి పని చేస్తే వచ్చే రివార్డులే లడ్డూలు. ఆయన ముందు ఉండే ప్రసాదం. సంతోషాన్ని, తిమ బండారాల్ని అందరు షేర్ చేసుకోవాలని చెబుతుంది. ఇక పెద్ద శరీరం ఉండే వినాయకుడు చిన్న ఎలుకపై ప్రయాణిస్తాడు. ఇది అందరి పట్ల అన్ని జీవుల పట్ల సమభావం ఉండాలని నేర్పిస్తుంది.

లీడర్ షిప్

'గణపతి' అంటే గణానికి అధిపతి. అంటే దేవుళ్ల సమూహానికి ఆయన అధిపతి! లీడర్షిప్ స్కిల్స్ ఉన్నప్పుడు లక్ష్యాలను అందుకోవడం తేలికవుతుందని ఈ విధంగా ఆయన సందేశమిస్తున్నాడు. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళే లక్ష్యాలను సాధించ దానికి అనేక దారుల్లో ప్రయత్నించగలుగుతారు.