సొంత గూటికి గాలి జనార్దన్ రెడ్డి  కేఆర్‪పీపీ  బీజేపీలో విలీనం

సొంత గూటికి గాలి జనార్దన్ రెడ్డి  కేఆర్‪పీపీ  బీజేపీలో విలీనం

బెంగళూరు: కర్నాటకలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేఆర్ పీపీ) పార్టీ బీజేపీలో విలీనమైంది. ఆ పార్టీ అధినేత, మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కాషాయ కండువా కప్పుకొన్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, మాజీ సీఎం యెడ్యూరప్ప సమక్షంలో కేఆర్ పీపీ విలీనం జరిగింది. మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

తానెప్పుడూ బీజేపీ వాదినేనని, అందుకే కేఆర్ పీపీని విలీనం చేశానని చెప్పారు. ఇటీవలే తమ పార్టీ బీజేపీకి బయట నుంచే మద్దతు ఇవ్వాలని అనుకున్నామని, కానీ తమ పార్టీలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు అంతా విలీనానికి ఓటు వేశారంటూ గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. బీజేపీలో చేరిన తాను నరేంద్ర మోదీ సారథ్యంలో ఓ సామాన్య కార్యకర్తగా దేశం కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.