ఆరోపణలు నిరూపిస్తే జనం మధ్య ఉరేసుకుంటా : గంభీర్

ఆరోపణలు నిరూపిస్తే జనం మధ్య ఉరేసుకుంటా : గంభీర్

ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ సెగ్మెంట్ పాలిటిక్స్ గరంగరంగా మారాయి. దేశమంతటా హాట్ టాపిక్ అయ్యాయి. క్రికెటర్ నుంచి పొలిటిషీయన్ గా టర్న్ తీసుకుని… ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌతమ్ గంభీర్ , అదే సెగ్మెంట్ నుంచి ఆప్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆతిషి మధ్య ఆరోపణల ఫైట్ తీవ్రస్థాయికి చేరింది.

ఆప్ అభ్యర్థి ఆతిషి గురువారం నాడు ఢిల్లీలో ఓ ప్రెస్ మీట్ పెట్టి.. గంభీర్ పై ఆరోపణలు చేశారు. రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక… మహిళ అయిన తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, తన ఆత్మగౌరవానికి భంగం కలిగించే రాతలు రాసిన పాంప్లెట్లను.. వివేక్ విహార్, కృష్ణ నగర్ లలో బీజేపీ నేతలు పంచిపెడుతున్నారని ఆమె చెప్పారు. ఈ పాంప్లెట్లలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు కూడా ప్రస్తావించారన్నారు. ఈ అవమానం భరించలేకపోతున్నానంటూ ఆమె ప్రెస్ మీట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. గంభీర్ పై ఢిల్లీ మహిళా కమిషన్ కు, ఈసీకి కంప్లయింట్ చేశారు.

ఐతే.. ఆప్ క్యాండిడేట్ ఆతిషి, ఇతర నేతలు చేసిన ఆరోపణలను తప్పుపట్టారు బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్. మహిళలను గౌరవించే కుటుంబం నుంచి తాను వచ్చానని అన్నారు. ఆమెను ఉద్దేశించి తాను అలాంటి మాటలు అన్నట్టుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిరూపిస్తే.. జనం మధ్య ఉరివేసుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే.. కేజ్రీవాల్ రాజకీయాలనుంచి తప్పుకోవాలన్నారు. కేజ్రీవాల్ రోజురోజుకూ దిగజారిపోతున్నారనీ… తాజా సంఘటనతో వారు మరింత పతనం అయ్యారని అన్నారు గౌతం గంభీర్. ఎన్నికల్లో గెలుపుకోసం ఇంత దిగజారుతారా.. చీపురుకట్టతో కేజ్రీవాల్ మైండ్ ను ఎవరైనా కడిగేయాల్సిన టైమ్ వచ్చింది అన్నారు గంభీర్.

గంభీర్ కు లక్ష్మణ్, హర్భజన్ సహా.. క్రికెటర్ల స్ట్రాంగ్ సపోర్ట్

పాంప్లెట్ ఆరోపణల వ్యవహారంలో గౌతం గంభీర్ కు సహచర క్రికెటర్లనుంచి గట్టి మద్దతు లభిస్తోంది. ‘గంభీర్ 2 దశాబ్దాలుగా నాకు తెలుసు.. ఆయన క్యారెక్టర్, మహిళలకు ఇచ్చే రెస్పెక్ట్ పై నేను హామీ ఇస్తున్నా’ అన్నారు లెజెండరీ ప్లేయర్ VVS లక్ష్మణ్.

గౌతం గంభీర్ మహిళలను అవమానించేవాడు కాదని హర్భజన్ సింగ్ చెప్పాడు గంభీర్ గురించి తనకు బాగా తెలుసన్నారు. మహిళల గురించి ఆయన చెడుగా ఎన్నడూ మాట్లాడడని అన్నాడు. ఎన్నికల్లో గెలుపు, ఓటమి అనేది విషయం కాదనీ.. కానీ.. ఇలాంటి విషయాలకు గంభీర్ చాలా దూరంగా ఉంటాడని భజ్జీ చెప్పాడు.